Wednesday, January 22, 2025
HomeTrending NewsTelangana: లోక్ సభ స్థానాలపై పార్టీల గురి

Telangana: లోక్ సభ స్థానాలపై పార్టీల గురి

లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్-9, కాంగ్రెస్-3, బిజెపి – 4, ఎంఐఎం -1 గెలుచుకున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రస్తుత స్థానాలు నిలుపుకొని అదనంగా సాధించాలని పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నాయి.

కాంగ్రెస్ 

శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అదే ఉపులో లోక్ సభ స్థానాలు అధికంగా కైవసం చేసుకునేందుకు పాఫులు కదుపుతోంది. 2019లో నల్గొండ నుంచి ఉత్తమ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కజగిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచారు. ముగ్గురు నేతల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మూడు స్థానాలకు కొత్త నేతలను తీసుకురావటం…అదనపు స్థానాలు కైవసం చేసుకునేందుకు పార్టీ ప్రణాలికలు సిద్దం చేస్తోంది.

రాష్ట్రం నుంచి పది స్థానాలు గెలిచి జాతీయ నాయకత్వానికి బహుమతిగా ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు పలుమార్లు వివిధ కార్యక్రమాల్లో ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావటంతో సిఎం మరింత పట్టుదలతో ఉన్నారని తెలిసింది.

బీఆర్ఎస్ 

భారత రాష్ట్ర సమితి ఉన్న స్థానాలను కాపడుకోవటానికే ప్రయాస పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంపి నియోజకవర్గాల వారిగా సమీక్ష ప్రారంభించిన పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ చేవెళ్ళ పరిధిలోని ఎంతలతో సమావేశం అయ్యారు. చేవెళ్ళ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపి రంజిత్ రెడ్డి బరిలో ఉంటారని ప్రకటించారు.

వరుసగా సమీక్షలు చేసి కేటిఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత కెసిఆర్ ఇప్పటివరకు తెలంగాణ భవన్ రాలేదు. లోక్ సభ ఎన్నికల నాటికి ప్రచారానికి వస్తారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో మార్పులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో ఆ స్థానంలో కెసిఆర్ పోటీ  చేస్తారని ప్రచారం జరుగుతోంది.

బిజెపి

తెలంగాణ రాష్ట్రంపై బిజెపి భారీ ఆశలు పెట్టుకుంది. ఆదిలాబాద్-సోయం బాపురావు, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్ – బండి సంజయ్, సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా వారికి మళ్ళీ టికెట్లు ఖాయమని తెలుస్తోంది. గతంలోని నాలుగు స్థానాలతో పాటు మరో పది స్థానాల్లో కమలం వికసించాలని జాతీయ నాయకత్వం పార్టీ నేతలను సన్నద్ధం చేస్తోంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 28న ఎంపి నియోజకవర్గాల వారిగా సమీక్ష చేయనున్నారు. ఎంపి స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ బలం, బలహీనతలు తెలుసుకొని… నాయకులను కార్యోన్ముఖులను చేసేందుకు వస్తున్నారు. ఎంపి స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి వెళ్ళేలా చేస్తే గెలుపు సునాసమని కమలం నేతలు భావిస్తున్నారు.

ఎంఐఎం 

శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లీస్ కు ఓట్ల శాతం తగ్గింది. దీంతో ఎన్నికలు ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళుతున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు సమస్యలు విన్నవించే పనిలో ఉన్నారు. ప్రజల్లో పట్టు పెంచుకోవాలని తద్వారా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్