తెలంగాణ రాజకీయ ముఖచిత్రం చిత్రవిచిత్రంగా మారుతోంది. ఏ నాయకుడు ఏ పార్టీ తరపున పోటీ చేస్తోరో, ఎపుడు ఏ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పొద్దున ఒక పార్టీ, సాయంత్రానికి మరో పార్టీ, తెల్లారే సరికి ఇంకో పార్టీ. ఇదే ఓ గమ్మత్తు అనుకుంటే… లోక్‌సభకు వచ్చేటప్పటికి మరో ట్రెండ్ మొదలైంది. ఓడిన వారే మళ్లీ పోటీకి సై అనడం. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచే గెలవని వారు.. లోక్ సభకు వచ్చేటప్పటికీ మళ్లీ పోటీకి రెడీ అయిపోయారు. పార్టీలు కూడా ఏ గణాంకాలతో అలాంటి వారికే టికెట్లిస్తున్నాయే మేధావులకు కూడా అంతుచిక్కడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలొస్తే మేమే… లోక్ సభ ఎన్నికలొచ్చినా మేమే అన్నట్లుగా కొందరి తీరు ఉంది. అక్కడ గెలవకపోతే ఇక్కడ జాక్ పాట్ కొట్టొచ్చన్నది వారి ఆలోచన. ఈ విధంగా తోటి నేతల అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఈ ఎన్నికల విషయానికే వస్తే నిజామాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా టి.జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో 15వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. నిజానికి జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతగానే పాపులర్. గతంలో 2006 కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల్లో కేసీఆర్ తో పోటీపడ్డారు. నిజామాబాద్ అతనికి పూర్తిగా కొత్త. జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ ఎంపీ పరిధిలోకి వస్తుంది అన్న ఒకే ఒక్క కారణంతో పోటీకి దిగారు. హస్తం హవాలో అక్కడి నుంచి గెలవొచ్చని ఆశ.
నిజామాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఆశావహులు లేరా అంటే లెక్కలేనంత మంది ఉన్నారు. నిజామాబాద్ ఎంపీగా మధు యాష్కీని రెండుసార్లు గెలిపించిన చరిత్ర ఉంది. అటొమోటిక్ గా అతనే అభ్యర్థి కావాలి. కానీ ఎల్బీనగర్ లో ఓడారు కాబట్టి అతనికి ఎంపీ టికెట్ దక్కదు. జీవన్ రెడ్డి ఫార్ములా మధుయాష్కీకి అప్లై కాదు. ఎందుకంటే మధుయాష్కీ బీసీ. పోనీ బాల్కొండ సీటు వదులుకున్న మాజీ విప్ ఈరవత్రి అనిల్ కు ఇచ్చిన మాటకోసమైనా ఎంపీ టికెట్ ఇచ్చారా అంటే అదీ లేదు. ఎందుకంటే అతనూ బీసీనే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ఊపులో అనిల్ అయినా మధుయాష్కీ అయినా ఇంకేవరైనా ఈజీగా గెలవవచ్చు. కానీ జీవన్..రెడ్డే అభ్యర్థి అవుతారు.
నిజామాబాద్ లాగే కరీంనగర్ కూడా బీసీ స్థానమే. పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేశారు. బీసీ ఖాళీ చేసిన స్థానాన్ని మరో బీసీకి ఇవ్వడానికి ఎందుకో కాంగ్రెస్‌లో సాగదీత. హుస్నాబాద్ సీటు వదులుకున్నాడు కాబట్టి ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని, కరీంనగర్ లో డామినేషన్ వెలమలది కాబట్టి వారికి ఇవ్వాలని పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కరీంనగర్ పీటముడి తెగడం లేదు. బీఆర్ఎస్ గ్రాప్ పడిపోయింది కాబట్టి కాంగ్రెస్ బీసీకే ఇస్తే… ఎవరో ఒక బీసీ ఎంపీ అవుతారు. అధికారంలో ఉన్న పార్టీలకు అది నచ్చదు. అందుకే రెడ్డి, వెలమ పేర్లు నానుతున్నాయి.
ఇక మెదక్ విషయానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం. బీఆర్ఎస్ పక్కాగా గెలుస్తామని నమ్మకం పెట్టుకున్న ఏకైక సీట్ మెదక్. బీసీకి ఇవ్వడానికి మనసొప్పదు కాబట్టే స్థానికులెవరూ లేనట్లు స్థానికేతరుడైన వెంకట్రామ్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తోంది. పోనీ అతనేమైనా పదవి లేకుండా ఉన్నాడా అంటే అల్రెడీ ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమ ఊపులోనూ 2009లో విజయశాంతిపై విజయానికి దగ్గరగా వచ్చిన చాగన్ల నరేంద్ర నాథ్… 2014లో కేసీఆర్‌పైనే రెండు లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నరేంద్రనాథ్ కు ఎంపీ టికెట్ హామీ ఇచ్చి గులాబీ దండులో కలిపేసుకున్నారు. మెదక్ ఎంపీ టికెట్ విషయంలో అతనికి ఈసారి కూడా కేసీఆర్ మొండిచెయ్యే చూపారు. కారణం బీసీనే.
ఇక దుబ్బాక బై ఎలక్షన్ లో నెగ్గిన రఘునందన్ రావు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 53 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలోనూ మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడారు. అయినా అక్కడ కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. తాను తప్పితే బీజేపీ తరపున పోటీ చేసే వారేవరు లేరు అన్నట్లు ఫోకస్ చేసుకున్నారు. మోదీ హవాలో పార్లమెంట్ కు వెళ్లవచ్చన్నది ఆశ. ఆ లెక్కన ఎవరికి ఇచ్చినా మోదీ హవాలో గెలిచే ఛాన్స్ ఉంటుందన్నపుడు మరో కొత్త వ్యక్తికి ఇవ్వవచ్చు. కానీ అగ్ర కుల రాజకీయాల్లో వాటికి తావులేదు.
మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇంట్లో రాయి పీకలేనోడు, ఏట్లో రాయి పీకుతామన్నట్లు బిల్డప్ లతో వస్తున్నారు. గెలిస్తే అది తమ క్రెడిట్, ఓడితే పార్టీ ఖాతాలో వేస్తారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్‌లు బలమైన నేతలుగా ఎదిగారు. బీజేపీలో వారిని మించిన అభ్యర్థులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే వారి స్థానాల్లోనూ అగ్రవర్ణాల కర్చీఫ్ పడేదే.
టికెట్ ఇచ్చేకాడ వాళ్లు ఉన్నారు కాబట్టే.. వీలు చిక్కితే చాలు బీసీ స్థానాలు కనుమరుగు చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో రెడ్లకు చెక్ పెట్టి మధుయాష్కీ గెలిస్తే.. తెలంగాణ సెంటిమెంట్ తో వెలమల చేతికి అందించారు. ధర్మపురి అరవింద్ అక్కడ మళ్లీ బీసీ జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ కూడా నిజామాబాద్ బీసీకే ఇచ్చుంటే ముగ్గురూ కూడా బీసీ అభ్యర్థులే అయ్యేవారు. ఎవరు గెలిచినా బీసీ ఎంపీనే. కానీ రెడ్డీతో చెక్ పెట్టే కుట్ర చేస్తున్నారు.
కరీంనగర్ ఎంపీ స్థానం వెలమలదే అన్నట్లుగా బీఆర్ఎస్ మార్చేసింది. కాంగ్రెస్‌కు అభ్యర్తులు లేని సమయంలో పొన్నం ప్రభాకర్ ధైర్యంగా పోటీ చేసి బీసీ జెండా రెపరెపలాడించారు. దానిని బండి సంజయ్ కంటిన్యూ చేశారు. బీఆర్ఎస్ గ్రాప్ పడిపోయింది బీసీ ఎంపీ ఛాన్సెస్ ఎక్కువ. అధికారంలో లేని సమయంలో రెండుసార్లు బీసీకే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈసారి వారికి ఇవ్వడానికి మనసొప్పడం లేదు. వ్యుహకర్త సునీల్ కనుగోలు బిసికి ఇవ్వాలని సూచిస్తే… నేతలు ఓసీల కోసం వెతుకుతున్నారని తెలిసింది.
బీసీ బండికి చెక్ పెట్టేలా కుయుక్తులు నడుస్తున్నాయి. తమ పబ్బం గడుపుకోవాలి కాబట్టి, బీసీలకు ఒకటి అరా టికెట్లు విసిరేస్తున్నాయి. పక్కా గెలుస్తామన్న స్థానాలు తమ వారికి ఇచ్చి, ఓడే స్థానాలను బీసీల పరం చేస్తున్నాయి. పోరాడే తత్వం ఉన్న బీసీలు… గెలిచి నిలిస్తే ఓర్వలేకపోతున్నారు.
అదేం విచిత్రమో హైదరాబాద్ స్థానానికి ఏ రెడ్డి, ఏ వెలమా పోటీ చేయరు. ఏ పార్టీ కూడా వారికి కేటాయించదు. ఎందుకంటే ఓడిపోయే సీటు కాబట్టే ప్రతిపార్టీ బీసీ కోటా కింద ఆ స్థానాన్ని చూపుతూ వస్తున్నాయి. భువనగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అదే చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్ లో గెలిచే పరిస్థితి ఉంటే బీసీలకు కేటాయించేవారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
-దేశవేని భాస్కర్