positive decision soon: సినిమా పరిశ్రమ విషయంలో అందరికీ మేలు చేకూర్చేలా త్వరలోనే ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామని సిఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని మెగా స్టార్ చిరంజీవి వెల్లడించారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన ఓ నిర్ణయం అతి త్వరలోనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన మీటింగ్ ఎంతో ఫలప్రదంగా జరిగిందన్నారు. సిఎం జగన్ తో సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సినిమా రంగ సమస్యల పట్ల ఎంతో సానుకూల వైఖరితోనే ఉందని, ఈలోగా పరిశ్రమ వైపు నుంచి, అనవసర భయాందోళనలతో, ఎవరు పడితే వారు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని, తనను గౌరవించి కాస్త సంయమనం పాటించాలని చిరంజీవి సూచించారు.
సిఎం ఆతిథ్యం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. పండుగ పూట ఒక సోదరుడిగా అయన నన్ను లంచ్ కు ఆహ్వానించారని, సోదరి… జగన్ సతీమణి భారతి స్వయంగా వడ్డించి.. వారిద్దరూ తన పట్ల చూపించిన అభిమానం, సిఎం తనతో మాట్లాడిన తీరు, ఆప్యాయత కనబరిచిన తీరు తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్షంగా కాకుండా రెండో వైపు కూడా వినాలని, ఆ తర్వాతే విధి విధానాలు తయారు చేయాలన్న ఆలోచనలో సిఎం ఉన్నారని అందుకే తనను లంచ్ మీటింగ్ కు ఆహ్వానించారని చెప్పారు. ఈ భేటీలో సిఎం ఇచ్చిన నమ్మకం, భరోసా నాకెంతో సంతోషం వేసిందన్నారు.
కొన్నినెలలుగా సినీ పరిశ్రమ మనుగడపై ఉన్న మీమాంస, తర్జన భర్జన, ఆగమ్య గోచరంగా తయారైన పరిస్థితుల నేపథ్యంలో సిఎంతో నేడు జరిగిన భేటీ ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. తరలోనే సమస్య కొలిక్కి వస్తుందన్న ఆశాభావం చిరు వ్యక్తం చేశారు. సామాన్య ప్రేక్షకుడికి వినోదం అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా గౌరవించాల్సి ఉంటుందని చిరంజీవి చెప్పారు.