‘బాహుబలి’తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దేశవిదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు, దీనితో బాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు ప్రభాస్ తో సినిమా కోసం క్యూ కడుతున్నారు. ప్రభాస్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. క్రేజ్ ఉన్న స్టార్స్ దగ్గరికి కార్పొరేట్ సంస్థలు వాలిపోతుంటాయి. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకోవడం కోసం స్టార్స్ ని తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాంట్రాక్టు కుదుర్చుకుంటుంటాయి.
ప్రభాస్ ను కూడా పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం సంప్రదించాయట. అయితే.. అందులో కేవలం కొన్నింటికి మాత్రమే ప్రభాస్ ఓకే చెప్పాడట. మిగిలిన కంపెనీలు భారీ ఆఫర్స్ ఇస్తామని చెప్పినా నో చెప్పాడట. గత సంవత్సరం నో చెప్పిన ఎండార్స్మెంట్ ల విలువ 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిసింది. ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టులని ప్రభాస్ వదులుకోవడానికి కారణం ఏంటంటే.. తనకు ఉన్న అభిమానులని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నాడట.
అభిమానుల్లో తనపై నమ్మకం చిరకాలం కొనసాగేలా ఉండే బ్రాండ్స్ కి మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అంతే కాకుండా ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లకే అతనికున్న టైమ్ సరిపోవడం లేదు. తన బిజీ షెడ్యూల్ దృష్ట్యా ప్రభాస్ అన్ని బ్రాండ్ కి ఓకే చెప్పడం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 30న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.