ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాసిన లేఖపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుపై చేసిన ఫిర్యాదును వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు.
వెలిగొండకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించిన ఎమ్మెల్యేలు, ఈ తప్పిదాన్ని సాకుగా చూపి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, కొండపి ఎమ్మెల్యే బాల వీరంజనేయులు ఈ మేరకు లేఖ రాశారు.
2014 ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని, ఈ విషయమై అనవసరంగా గందరగోళం సృష్టించి ప్రకాశం జిల్లా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయవద్దని వారు లేఖలో కోరారు. నిత్యం కరవుతో అల్లాడే తమ జిల్లాపై కక్ష వద్దని వారు విజ్ఞప్తి చేశారు.