7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-1

అదిగో లేపాక్షి-1

లేపాక్షి గురించి ముప్పయ్యేళ్ల కాలంలో నేను కనీసం వందకు పైగా వ్యాసాలు రాసి ఉంటాను. అయినా తనివి తీరదు. ఇంకా చెప్పాల్సిన కళా వైభవం ఎంతో మిగిలిపోయే ఉంటుంది. పాతికేళ్ళపాటు ఆ గుడి ఒడిలో పెరిగినవాడిని కాబట్టి…ఆణువణువూ నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటాను. చరిత్రకారుల పరిశోధన గ్రంథాలు, ఆధ్యాత్మికవేత్తల విశ్లేషణలు చదివేకొద్దీ లేపాక్షి గురించి నాకు తెలిసింది ఆవగింజంత కూడా కాదని అర్థమవుతూ ఉంటుంది.

ఆమధ్య “హంపీ వైభవం” పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. అప్పుడు మా లేపాక్షి మనసు చిన్నబుచ్చుకుంది. హంపీ గురించి అన్నన్ని పుస్తకాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశావే! నిన్ను పెంచిన లేపాక్షి గురించి పరిశోధించి వ్యాసాలు రాయకపోతే ఎలా? అని లేపాక్షి జనం నన్ను నిలదీశారు. వారి నిలదీతలో అర్థముంది. లేపాక్షిమీద తపన ఉంది. నామీద లేపాక్షికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూ…లేపాక్షి మీద పరిశోధించి రాసిన సాధికారికమయిన పుస్తకాలను, వ్యాసాలను సంవత్సరం పాటు సేకరించాను. రెండు, మూడు కావ్యాలు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల దొరకలేదు.

నాకు దొరికిన ప్రచురితమైన నలభై తెలుగు, కన్నడ, ఇంగ్లీషు లేపాక్షి పుస్తకాల నుండి ప్రధానంగా మూడింటి ఆధారంగా ఈ వ్యాసాలను రాస్తున్నాను. అవి:-

1. Lepakshi. రచయిత- ప్రఖ్యాత చారిత్రిక పరిశోధకుడు ఆమంచర్ల గోపాల రావు. ఇంగ్లీషులో దీన్ని మోనో గ్రాఫ్ – పరిచయ వ్యాసంగా పేర్కొన్నా… పరిశోధన స్థాయి గ్రంథం ఇది. 1969లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ప్రచురణ.
2. లేపాక్షి ఆలయం. రచయిత- హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు, ఎస్ వీ యూనివర్సిటీ, తిరుపతి. పరిశోధన గ్రంథం. 1987 ప్రచురణ.
3. త్యాగశిల్పం. పద్య, గద్య కావ్యం. కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన పదవిలో పనిచేస్తుండిన తెలుగు పద్యప్రేమికుడైన లంకా కృష్ణమూర్తి పద్యాలు; లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడు, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ(మా నాన్న) గద్యం. ఇద్దరూ కలిసి రాసినది. 1975 ప్రచురణ.

లేపాక్షి గురించి ఇన్ని పుస్తకాలు ఉండగా ఈ మూడింటినే నేనెందుకు ప్రమాణంగా తీసుకున్నానో వివరించడం నా కనీస ధర్మం.

లేపాక్షికి దారి దీపం
ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ చేత “జైలు విద్యార్థి” అని బిరుదు పొందిన హిందూపురం తొలి ఎమ్మెల్యే పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లేకుంటే లేపాక్షి గుడి ఏనాడో మట్టి కొట్టుకుపోయి ఉండేది. రెండు వందల యాభై ఏళ్లకు పైగా మట్టిని కప్పుకుని తన ఉనికిని తానే మరచిపోయిన లేపాక్షి దుమ్ము దులిపి బయటి ప్రపంచానికి తెలిసేలా చేయడంలో కల్లూరు సుబ్బారావు కృషి వేనోళ్ల పొగడదగినది. స్థానికులు చెప్పే లేపాక్షి కథల్లో ఏది నిజమో! ఏది కల్పితమో! తెలియక అయోమయం ఉండేది. శాసనాలు, ఇతర ఆధారాలతో లేపాక్షి ఆలయం గురించి సాధికారికమైన చరిత్ర రాయించాలని కల్లూరు సుబ్బారావు పడ్డ శ్రమకు ప్రతిఫలంగా అప్పటి లలిత కళా అకాడెమీ ఈ మహా యజ్ఞాన్ని చారిత్రిక పరిశోధకుడైన ఆమంచర్ల గోపాల రావు చేతిలో పెట్టింది. కేంద్ర లలిత కళా అకాడెమీ కూడా ఈ ప్రాజెక్టుకు కొంత ఆర్థిక సహాయం చేసింది. భారతీయ పురాతన ఆలయాలు, ప్రత్యేకించి దక్షిణాది ఆలయాల మీద దశాబ్దాల పాటు పరిశోధనలు చేసిన గోపాలరావు రెండేళ్లపాటు లేపాక్షిలో ఉండి… తెలుగు చిత్రకళా వైభవాన్ని ప్రపంచ యవనిక మీద రెపరెపలాడించిన ప్రఖ్యాత చిత్రకారుడు కొండపల్లి శేషగిరి రావును వెంటబెట్టుకుని శిల్పాల చిత్రాలు గీయించి…వందల శాసనాలను పరిశీలించి…99 పేజీల టెక్స్ట్ తో, 30 పేజీల చిత్రాలతో ప్రచురించిన లేపాక్షి డాక్యుమెంట్ ఇది.  పుస్తకం ముద్రణ అయ్యే నాటికి గోపాల రావు గారు వయో సంబంధమైన అనారోగ్యంతో కన్నుమూశారు.

లేపాక్షి గర్భాలయాల్లో పూజ పునస్కారాలు లేక ముళ్ళ పొదలు పెరిగి  పశువుల చావిళ్ళలా ఉన్న లేపాక్షి ఆలయాన్ని ఎలా కల్లూరు సుబ్బారావు అహోరాత్రాలు శ్రమించి వెలుగులోకి తెచ్చారో కొండపల్లి శేషగిరి రావు తరువాత తన జ్ఞాపకాల్లో నమోదు చేసి పెట్టారు.  నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా లేపాక్షి ఉత్సవాలను ఘనంగా జరిపినప్పుడు శేషగిరిరావు అనుభవాలు చర్చకు వచ్చాయి.

కల్లూరు సుబ్బారావు, లలితకళా అకాడెమి ప్రోత్సాహాన్ని రచయిత ముందు మాటలో ఎంత గొప్పగా ప్రస్తావించారో చూడండి.

“I owe a debt of gratitude to Padmasri Kalluri Subba Rao who was greatly responsible for the discovery of this grand treasure house of Vijayanagar art and has, with great and persistent labour and effort, collected and compiled all the necessary material to study this great edifice and its art. But for his pioneering efforts this monograph would have been impossible.

My thanks are due to Sri N. Narotham Reddy, President, and Sri L. N. Gupta, I.A.S., Honorary Secretary, Andhra Pradesh Lalit Kala Akademi for encouraging me to write this monograph and providing me with all the necessary facilities to do it. I must thank Sri K. Seshagiri Rao for the assistance rendered by him to me for the study of this monument”.

గోపాలరావు చేసింది అక్షరాలా ఒక మహా యజ్ఞమే అని ఆనాటి నేషనల్ మ్యూజియం డైరెక్టర్ శివరామమూర్తి శిరసు వంచి రచయితకు ఇలా కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

“Sri Amancharla Gopala Rao, who has written the text, has given an introduction of Indian art, the South Indian temple, the history of the South Indian people and against the background of religion, legend and iconography he has discussed the temple at Lépäkshi, its architecture, its sculptural wealth and the paintings. It is essential that a magnificent temple like this, with rich sculptural and pictorial wealth, should be properly studied and appreciated. Sri Gopala Rao should be congratulated for having contributed the study of Lepakshi in this beautifully illustrated handsome volume. The Andhra Pradesh Lalit Kala Akademi has to be congratulated on this publication on a great phase of Andhra art.

New Delhi,
December 21, 1968.
C. Sivaramamurti, Director, National Museum, New Delhi”.

ఆమంచర్ల గోపాలరావు అంటే ఎవరో ఇప్పుడెవరికీ తెలియకపోవచ్చు. లేపాక్షి మీద వచ్చిన అన్ని పుస్తకాలకు దారిదీపం ఆయనే. లేపాక్షి గుడి ఉన్నంతవరకు ఆయన పేరును తలచుకోవాల్సిందే. చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పం, చిత్రం, ఆగమ శాస్త్రం, ఆనాటి సాంఘిక జీవన విధానం…ఇలా ఆయన స్పృశించని అంశం లేదు.

లేపాక్షి వెలుగులు
ఎస్ కే యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు. రాయలసీమ ఆలయాల మీద ఆయన పి హెచ్ డి చేశారు. లేపాక్షి ఆలయం ఆయన్ను విపరీతంగా ఆకర్షించింది. కొన్నేళ్లపాటు శ్రమించి ఇంగ్లీషులో The Lepakshi Temple, తెలుగులో లేపాక్షి ఆలయం పేరిట పుస్తకాలను ప్రచురించారు. విజయనగర ఆలయాలతో మొదలు పెట్టి లేపాక్షి ఆలయం ప్రత్యేకతను చాలా లోతుగా విశ్లేషించారు. కట్టు కథల జోలికి వెళ్లకుండా చారిత్రిక ఆధారాలతోనే రాసిన ఈ పుస్తకం ఒక పరిశోధన గ్రంథం. కామేశ్వర రావు గారు నాకు దగ్గరి బంధువు కూడా.

లేపాక్షి కవిత్వం
అగస్త్యుడు తపస్సు చేసిన చోటు లేపాక్షి అని స్కాంధ పురాణం ఆధారంగా నిరూపిస్తూ తెలుగు ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు, జోతిశ్శాస్త్రవేత్త, భగవద్గీతను, సౌందర్యలహరిని తెలుగు పద్యాల్లోకి అనువదించిన మా తాత పమిడికాల్వ చెంచు నరసింహ శర్మ కవితాత్మకంగా రాసిన సుదీర్ఘమైన వ్యాసం ఆంధ్ర పత్రికలో 1970 ప్రాంతాల్లో అచ్చయ్యింది కానీ ఆ ప్రతి దొరకలేదు. అయితే ఆ వ్యాసంలో విషయాన్ని ప్రస్తావిస్తూ మా నాన్న ఆరాధన ఆధ్యాత్మిక మాసపత్రికలో 1977లో రాసిన వ్యాసం నాదగ్గర భద్రంగా ఉంది.

లేపాక్షి మీద కనీసం పది పద్యకావ్యాలున్నాయి. అందులో “త్యాగశిల్పం” చిన్నదే అయినా గొప్ప కావ్యం. దగ్గరుండి కట్టించిన విరుపణ్ణ త్యాగానికి ప్రతిఫలంగా నిలిచిన లేపాక్షి ఆలయాన్ని కవితాత్మకంగా వర్ణించారు లంకా కృష్ణమూర్తి. ఆయన మాతృ భాష కన్నడ. పుట్టింది పెనుగొండలో. పెరిగింది, స్థిరపడింది బెంగళూరులో. వృత్తి వేరు. ప్రవృత్తి – తెలుగు, కన్నడ, సంస్కృతం, ఇంగ్లీషు సాహిత్యాలు. ఆ అందమైన పద్యాల కొనసాగింపుగా మా నాన్న చెంచు సుబ్బయ్య గద్య రచన.

ఈ పుస్తకాలేవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటివి పునర్ముద్రణలు కావు. లేపాక్షిలో మిత్రుడు లేపాక్షి రామ్ ప్రసాద్ దగ్గర భద్రంగా ఉంటే కొరియర్లో తెప్పించుకుని…జెరాక్స్ చేసుకుని వారి పుస్తకాలు వారికి మళ్లీ కొరియర్లో వెనక్కు పంపాను. రామ్ ప్రసాద్ తాత వెంకటనారాయణప్ప లేపాక్షికి తొలి సర్పంచ్. ఐదు దశాబ్దాలపాటు లేపాక్షి గుడిని వెలికి తీసుకురావడానికి కల్లూరు సుబ్బారావుతో కలిసి పనిచేశారు.

నాకు తెలిసిన ఆవగింజంత భాషా సాహిత్యాలకు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలకు లేపాక్షి బీజం. అక్కడ తాకిన ప్రతిదీ శిల్పమే. చూసిన ప్రతిదీ అందమే. రాతిలో పోతపోసిన ఆ అందాలను, ఆనందాలను చెప్పకపోతే… నాకొచ్చిన నాలుగు మాటలకు విలువ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం.

రేపు:- అదిగో లేపాక్షి-2
“వీరభద్రాలయం”
శ్రీ పమిడికాల్వ చెంచు సుబ్బయ్య వ్యాసం

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్