Saturday, January 18, 2025
Homeసినిమాఆడుజీవితం నుంచి అందమైన జీవితం వరకు ...

ఆడుజీవితం నుంచి అందమైన జీవితం వరకు …

హాలీవుడ్ లో బాయ్ హుడ్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా 2014 లో వచ్చింది. ఈ సినిమా ప్రత్యేకత పన్నెండేళ్లపాటు షూటింగ్ సాగింది. అన్నాళ్ళు ఎందుకంటే, ఈ డైరెక్టర్ గారికి ఒక పిల్లవాడు ఎలా బాల్యం దాటి కౌమారం లో అడుగు పెడతాడు అని చూపించాలని కోరిక. ఐదేళ్ల పిల్లాడిని ప్రధాన పాత్రకు ఎంపిక చేసి నిదానంగా సినిమా తీసుకుంటూ వెళ్ళాడు. ఈ సినిమాలో పాత్రధారులందరూ అంతే. అన్నాళ్లూ ఓపికగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. చాలా ప్రశంసలొచ్చాయి ఈ చిత్రానికి. మనదగ్గరా ఒక సినిమా 16 ఏళ్ళ పాటు షూటింగ్ జరుపుకుని ఈ మధ్యే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అదే మలయాళ సినిమా ‘ది గోట్స్ లైఫ్’. అయితే ఇక్కడ ఆ సినిమా కథ, వివరాలు చెప్పడం లేదు. ఇప్పటికే ఆ వివరాలన్నీ వచ్చాయి, వస్తున్నాయి కూడా. నేను ఇంకా ఈ సినిమా చూడలేదు. కానీ సినిమా గురించి చదివాను. వాస్తవగాథకు పుస్తకరూపం కల్పించడం చదివాను. అష్టకష్టాలు పడి 16 ఏళ్లపాటు తెరకెక్కించడం తెలుసుకున్నాను. కొన్ని వివాదాలూ చుట్టుముట్టాయి. అన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా లో హీరో గురించే నేను చెప్పాలనుకుంటున్నా.

మలయాళ హీరోల్లో అందగాడంటే పృథ్వి రాజ్ సుకుమారనే. సాధారణంగా అందమైన హీరోలు చేయలేని సాహసం చేశాడు. చరిత్ర సృష్టించాడు. చెప్పాలంటే ఒక సాహసం కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా 2008 లో బెన్యామీన్ రచించిన ఆడుజీవితం నవల కేరళలో బెస్ట్ సెల్లర్ గా నిల్చింది . ఈ రచన ఆధారంగా బ్లెస్సి దర్శకత్వంలో ది గోట్ లైఫ్ సినిమాలో నటించడం ద్వారా పృథ్విరాజ్ సుకుమారన్ అనేక సాహసాలు చెయ్యాల్సి వచ్చింది. కొన్ని త్యాగాలు కూడా. 2008 లో షూటింగ్ ప్రారంభించే నాటికీ పృథ్వి ఇంత పెద్ద స్టార్ కాదు. పాతికేళ్ల వయసు. పెళ్లి, పిల్లలు లేని జీవితం. నత్త నడకన సాగుతూ మధ్యలో షూటింగ్ ఆగిపోయింది. అప్పట్లో మలయాళం సినిమాకి ఇంత మార్కెట్ లేదు. మెల్లగా ఆ పరిస్థితి దాటి అన్నీ సర్దుకుని 2018 లో షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లి కరోనా కారణంగా చాన్నాళ్లు ఇరుక్కు పోయారు. సరయిన తిండీ తిప్పలు లేవు. ఎలాగో వచ్చినా షూటింగ్ రెండేళ్లు ఆగిపోయింది. ఆ తర్వాత కూడా నిధుల లేమి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నెమ్మదిగా నడిచింది. మొత్తమ్మీద మార్చి 28 న విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ 16 సంవత్సరాల్లో సుకుమార్ జీవితంలో అనేక మార్పులు… పెళ్లయింది. తండ్రి అయ్యాడు. 25 ఏళ్ళ యువకుడు అప్పుడు. ఇప్పుడు 41 ఏళ్ళు. అయితే సినిమా పూర్తి చేయాలనే సంకల్పం మాత్రం అందరిలోనూ ఉంది. అందుకే తానూ ఎప్పుడూ సినిమా నుంచి తప్పుకుందామను కోలేదు. ఇక ఈ సినిమాలో పృథ్వి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. సినిమాలో నజీబ్ ఎడారిలో ఉండేది మూడేళ్లే. కానీ ఆ పాత్ర కోసం పృథ్వి 16 ఏళ్ళు కష్టపడ్డాడు. పారితోషికం కూడా తీసుకోలేదు. అందుకు అతనేమీ బాధపడటం లేదు. తగిన ఫలితం లభించిందని ఆనందిస్తున్నాడు.

బాయ్ హుడ్ సినిమాలో బాల్యం నుంచి టీనేజ్ వరకు చూపారు. అడుజీవితం అటువంటి సినిమా కాదు. కానీ హీరో పృథ్విరాజ్ యవ్వనం నుంచి మధ్యవయసుకు వచ్చేవరకు షూటింగ్ జరిగింది. బహుశా ప్రపంచంలోనే ఏ హీరో ఇలా నటించి ఉండడు. ది గోట్ లైఫ్ సినిమా చూసి ఆనందించడమే పృథ్వి రాజ్ సుకుమారన్ కు మనమిచ్చే నిజమైన బహుమతి.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్