‘ఓరు ఆధార్ లవ్’ మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్… ఒకే ఒక్క కన్ను గీటుతో ‘వింక్ గాళ్’గా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్.. హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ లో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 30న ‘ఇష్క్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
“‘ఇష్క్’ సినిమాను నేను సైన్ చేయడం చాలా తొందరగా జరిగిపోయింది. మాములుగా అయితే ప్రతీ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ నేను తీసుకొని మధ్యలో చాలా సార్లు డిస్కషన్స్ పెట్టి ఓకే చేస్తాను కానీ.. ఈ సినిమాకి మాత్రం రెండు రోజుల్లోనే ఓకే చేశాను. మలయాళ ‘ఇష్క్’ చిత్రాన్ని నేను చూశాను. ఈ చిత్రంలోని కథ, థ్రిల్లింగ్ అంశాలు నచ్చాయి. దీంతో ‘ఇష్క్’ సినిమా తెలుగు రీమేక్‌కు వెంటనే అంగీకరించాను. ఈ సినిమా రోటిన్ లవ్‌స్టోరీలా ఉండదు. ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ‘ఇష్క్’ సినిమా జర్నీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను” అని చెప్పింది.
“తేజ మంచి కో స్టార్. మీకు అందరికీ తెలుసు, తేజ చాలా యాక్టీవ్ గా ఉంటాడు కాబట్టి సెట్స్ లో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ సెట్ అంతటినీ లైవ్ లో ఉంచుతాడు. నాకు తెలుగు డైలాగ్స్ విషయంలో బాగా హెల్ప్ చేశాడు. ఈ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజు సహకారం వల్ల మరింత బాగా నేను నటించగలిగాను. ‘మలయాళ వెర్షన్‌లోని హీరోయిన్ను మర్చిపో.. నీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయ్యి’ అని దర్శకుడు రాజు చెప్పారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించగలిగాను. సూపర్‌గుడ్ ఫిలింస్ వంటి పెద్ద బ్యానర్లో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్” తెలిపింది.
“మలయాళ, తెలుగు ప్రేక్షకుల అభిరుచులు వేరని తెలుసు. అందుకే మలయాళ వెర్షన్ స్టోరీలోని సోల్‌ను మాత్రమే మేం తీసుకున్నాం. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేశాం. టెక్నికల్ థింగ్స్ అలాగే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. కథ, కథలోని పాత్ర తాలుకూ ప్రాధాన్యం నన్నుఓ కొత్త సినిమా అంగీకరించేలా చేస్తాయి. కథే నాకు ముఖ్యం. తెలుగు భాషను నేను అర్థం చేసుకోగలను. భవిష్యత్‌లో పూర్తిగా తెలుగులో మాట్లాడతానన్న నమ్మకం ఉంది. ఇందుకు తగ్గ శిక్షణ తీసుకుంటున్నాను. టాలీవుడ్ నా సెకండ్ హోమ్.
“‘చెక్’ సినిమాలో నాది చిన్నపాత్రే. ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనపెడితే నా పాత్ర మేరకు నేను నటించాను. నాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. చెక్ చిత్రంలో నా స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. కానీ ‘ఇష్క్’లో సినిమా అంతా తెర పై కనిపిస్తాను. ప్రస్తుతం తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలోనే మేకర్స్ వెల్లడిస్తారు. అలాగే మలయాళంలో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాను. అలాగే హిందీలో రెండు సినిమాలకి సంబందించి అప్ డేట్స్ రావాల్సి ఉంది” అని ప్రియా ప్రకాష్ తెలియచేశారు.