Friday, September 20, 2024
HomeTrending NewsTPCC: బిజెపికి చెక్ పెట్టేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక

TPCC: బిజెపికి చెక్ పెట్టేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక

ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సిఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై చర్చ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీటన్నింటికన్నా ముఖ్యమైన కార్యం సిఎం తన భుజస్కందాలపై వేసుకున్నారని తెలిసింది.

రాష్ట్రం నుంచి సోనియా గాంధి, ప్రియాంక గాంధీల్లో ఒకరు పార్లమెంటు బరిలోకి దిగేలా ఒప్పించేందుకు రేవంత్ రెడ్డి వెళ్ళారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం నుంచి గాంధి కుటుంబంలో ఒకరు బరిలోకి దిగితే రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతల అంచనా.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ గ్రాప్ చాలా వరకు పడిపోయిందనేది నిష్టూర సత్యం. రాయ్ బరేలి నుంచి సోనియాగాంధి గెలుపునకు అవకాశాలు ఉన్నా… అమేథి లేదా మరో చోట ప్రియాంకా గాంధి గెలవటం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధిని రాష్ట్రానికి తీసుకు రావాలనేది సిఎం ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు.

వయోభారం రిత్యా సోనియా గాంధి తెలంగాణకు రాకపోవచ్చు. కాంగ్రెస్ కుటుంబ వారసత్వం కొనసాగింపుగా సోనియాగాంధీ రాయ్ బరేలి నుంచి బరిలో ఉండే అవకాశం ఉంది. రాహుల్ గాంధి వయనాడ్ నుంచి ఎంపిగా ఉన్నందున రాబోయే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే మళ్ళీ పోటీలో ఉండనున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఇక మిగిలింది ప్రియాంకా గాంధి ఆమెను తెలంగాణ నుంచి పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. పనిలోపనిగా రేవంత్ రెడ్డి నాయకత్వం సుస్థిరం అవుతుందని సిఎం సన్నిహితులు భావిస్తున్నారు.

సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటం ఖాయమని ఏఐసిసి వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీరు పోటీ చేసేందుకు కరీంనగర్ అనువైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదిస్తుండగా…మహబూబ్ నగర్ లేదా చేవెళ్ళ, మల్కాజ్ గిరిల నుంచి పోటీ చేయించాలని సిఎం యోచిస్తున్నట్టు వినికిడి.

గతంలో ఇందిరగాంధి ప్రాతినిధ్యం వహించిన మెదక్ నుంచి బరిలోకి దిగితే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని కొందరు నేతలు సిఎంకు వివరించారు. మెదక్ నుంచి పోటీ చేస్తే పార్టీకి పూర్వ వైభవం, కెసిఆర్ కుటుంబ రాజకీయానికి చెక్ పడుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రియాంక గాంధి లోకసభ ఎన్నికలపై ఆసక్తి చూపకపోతే తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని సిఎం మరో ప్రతిపాదన కూడా అధిష్టానం ముందు ఉంచుతున్నారని అంటున్నారు.

సిఎం రేవంత్ రెడ్డి ఇంతగా చొరవ తీసుకునేందుకు మరో కారణం కూడా ఉందని సమాచారం. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో ఒక అంశం విస్తృతంగా ప్రచారం జరిగింది. MLA కోసం ఓటు కాంగ్రెస్ కు వేస్తామని, పార్లమెంటు ఎన్నికల్లో బిజెపినే బలపరుస్తామని తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే ప్రకటించారు. కాంగ్రెస్ నేతలకు కూడా ఈ అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి బిజెపికి సీట్లు అధికంగా దక్కితే పార్టీకి నష్టం…ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపవచ్చు.

2018 ఎన్నికలతో పోల్చితే 2023 శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది. ఉత్తర తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో కమలం పార్టీని ఆదరించటం కాంగ్రెస్ నేతలను కలవర పరుస్తోంది. బిజెపిని కట్టడి చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి తాజా ఎత్తుగడ వేశారని అంటున్నారు. గత ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళుతున్నారని హస్తం నేతలే చెప్పుకుంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్