డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుంటే.. సుజిత్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది.పవన్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ‘డాక్టర్’, ‘డాన్’, ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టుగా ప్రకటించారు.
ఈ నటి సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఆమె తన రూపం, శైలితో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటను తెరపై చూడాలని సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబై మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.