తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్.సీ.సీ) ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం నిర్మాతలు దిల్ రాజు, సి.కళ్యాణ్ పోటీపడుతున్నారు. ఇద్దరూ కూడా జోరుగా ప్రచారం చేయడంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నాం 3 గంటల వరకు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కిపు ఉంటుంది. ఆరు గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు.
అయితే.. ఈ ఎన్నికల గురించి ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం ఎందుకు ఇంతగా పోటీపడుతున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే.. ఛాంబర్ ఎదిగిందని సంతోషడాలో.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందకు సిగ్గుపడాలో తెలియడం లేదు. నేను కూడా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పని చేశాను. చాలా ఎన్నికలు చూశాను కానీ.. ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల ప్రచారం చూస్తుంటే.. భయమేస్తోంది అన్నారు.