Saturday, March 7, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజగమంత కుటుంబానికి పెద్ద

జగమంత కుటుంబానికి పెద్ద

లోకంలో పరిచయాలు చాలానే ఏర్పడతాయి. కానీ కొన్ని పరిచయాలు మాత్రమే కాల ప్రవాహాన్ని తట్టుకుని, రక్తం పంచుకోకపోయినా గాఢంగా, అత్యంత ఆత్మీయంగా మారుతాయి. నాకు లక్ష్మీకాంతమ్మ మేడమ్ గారితో ఉన్న ముప్పై ఏళ్ల అనుబంధం అటువంటిదే. పిలుపులో ఆమె నాకు ‘మేడమ్’ కావొచ్చు.. కానీ నా పాలిట ఆమె ఒక కల్పవృక్షం, మా కుటుంబానికి పెద్ద దిక్కు.

వృత్తిని మించిన ఆత్మీయత:-

వృత్తి ధర్మం రీత్యా మేము మొదటిసారి కలిసినప్పుడు, ఆమెలో ఒక ప్రొఫెసర్ కంటే ఒక మాతృమూర్తినే నేను ఎక్కువగా చూశాను. ఆమె మాటల్లోని ఆత్మీయత, పలకరింపులోని వెచ్చదనం నన్ను తొలిచూపులోనే కట్టిపడేసాయి. ఆమె భర్త వెంకట్రావు గారు కూడా అంతే అపేక్షగా ఉండేవారు. నేను విజయవాడలో ఉన్నప్పుడు, నాకు బాబు పుట్టిన విషయం తెలిసి, వారు స్వయంగా వచ్చి నన్ను, నా బిడ్డను ఆశీర్వదించడం మాపై వారికున్న మమకారానికి నిదర్శనం. ఆ క్షణం నుండి మా మధ్య ఉన్న పరిచయం ఒక మధురమైన బంధంగా విస్తరించింది.

సంతానం లేని లోటును.. అందరిపై ప్రేమై కురిపించి…

భగవంతుడు వారికి సంతానాన్ని ప్రసాదించకపోయినా, వారు మాత్రం ఎందరినో తమ బిడ్డలుగా దత్తత తీసుకున్నారు (మనసుతో). ఆ ‘బిడ్డల’ జాబితాలో నేను ఉండటం నా అదృష్టం. వారి ఇంటికి ఎప్పుడు వెళ్లినా, ఆ ఇల్లు ఒక దేవాలయంలా అనిపించేది. చేతిలో తిరుపతి ప్రసాదం సిద్ధంగా ఉండేది. నా యోగక్షేమాల గురించి అడిగే ప్రశ్నల్లో ఒక తల్లి ఆరాటం కనిపించేది.

కొండంత ప్రేమ

ప్రేమ అంటే కేవలం మాటలు కాదని ఆమె నాకు నేర్పారు. నేను ఒక్కోసారి వంట చేసుకోలేదని తెలిస్తే, ఆమె పడే తపన వర్ణనాతీతం. ఉడికించిన బంగాళాదుంపలో, కూరలో ఏదో ఒకటి సిద్ధం చేసి “ఇది తిను బాబు/పాప” అని ఇచ్చి పంపేవారు. నమ్మూర బేకరీ నుండి వచ్చే తినుబండారాలను మా కోసం ప్రత్యేకంగా అట్టే పెట్టేవారు. ఆ చిన్న చిన్న వస్తువుల్లో ఆమె కురిపించిన మమకారం ఎంతో గొప్పది. ఏ సమస్య వచ్చినా, ఆమె ముందు నిలబడితే సగం భయం పోయేది. “నేనున్నాను” అన్న ఆమె మాట కొండంత ధైర్యాన్నిచ్చేది.

విజ్ఞాన గని – సమాజానికి దిక్సూచి

సైకాలజీ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడినా, ఆమె విశ్రాంతిని కోరుకోలేదు. పత్రికల్లో వ్యాసాలు, సభలు, సమావేశాలతో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండేవారు. ఒకే పత్రికలో సుదీర్ఘకాలం ‘ఫ్యామిలీ కౌన్సిలింగ్’ కాలమిస్టుగా ఆమె చేసిన సేవలు అనన్యం. కొన్ని వేల కుటుంబాల్లో ఆవిడ వెలుగులు నింపారు. ఆవిడ సమాధానాలతో వచ్చిన పుస్తకం ఒక జీవన వేదం. నిజానికి, నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్స్ చేయాలని నిర్ణయించుకోవడానికి ఆవిడ ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణం.

వయసుని ఓడించిన చైతన్యం

80 ఏళ్లు దాటినా కౌన్సిలింగ్, మెడిటేషన్ అంటూ బిజీగా ఉండటం ఆమెకే చెల్లింది. వెంకట్రావు గారు మరణించినప్పుడు ఆమె కుంగిపోతారని భయపడ్డాను, కానీ ఆమె ధైర్యంగా నిలబడి మేనకోడలు హైమావతి గారి సంరక్షణలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. 90 ఏళ్ల వయసులో కూడా.. ప్రతిరోజూ ఉదయాన్నే అందరికంటే ముందు నాకు వాట్సాప్‌లో ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ పంపేవారంటే, ఆవిడ ఎంతటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారో అర్థమవుతుంది.

ముగియని ప్రయాణం

కడసారి చూడాలనుకునే లోపే, ఆరోగ్య సమస్యలతో ఆమె అనంత లోకాలకు వెళ్ళిపోయారనే వార్త నా గుండెను కలిచివేసింది. 90 ఏళ్ల పరిపూర్ణ జీవన ప్రస్థానం అది. ఆమె దగ్గర నేను నేర్చుకున్న పాఠాలు, పొందిన ప్రేమాభిమానాలు నా జీవితాంతం పదిలంగా ఉంటాయి. భౌతికంగా ఆమె దూరమైనా, ఏ లోకంలో ఉన్నా ఆమె ఆశీర్వాదాలు నాకు రక్షగా ఉంటాయని నా నమ్మకం.
పరిపూర్ణ జీవితానికి నిదర్శనం.. మా లక్ష్మీకాంతమ్మ గారికి ఇదే నా హృదయపూర్వక అక్షరాంజలి.

-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular