Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅడుగుకో కీచకుడు

అడుగుకో కీచకుడు

వారు బతికి బాగుంటే ఇంకెందరినో బతికించేవారు. ప్రాణాల విలువ తెలీని రాక్షసుల చేతుల్లో బలయిపోయారు.

ఒకరా! ఇద్దరా! ఎంతోమంది మహిళలు దుష్టుల చేతిలో హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. వ్యవస్థ డొల్లతనం బయట పడేలా చట్టమూ కొన్నిచోట్ల పనిచేయడంలేదు. రోజూ ఇటువంటి వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పే నాలుగు సంఘటనల్లో బాధితులు వైద్య సేవారంగానికి చెందినవారు. పదిమందికీ ప్రాణాలు పోయాల్సిన వారు కొందరు దుర్మార్గుల చేతిలో బలైపోయారు.

1973లో…
ఎక్కడో కర్నాటకలో పుట్టి నర్స్ ట్రైనింగ్ పూర్తిచేసి ముంబై మహానగరంలో అడుగుపెట్టింది అరుణా షాన్ బాగ్. ప్రముఖ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే పనిచేసే మరో వైద్యునితో వివాహమూ నిశ్చయమైంది. వార్డ్ బాయ్ సరిగా పనిచేయడం లేదని అతన్ని మందలించింది. అది మనసులో పెట్టుకున్న ఆ కీచకుడు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో దాడిచేసి, కుక్కలను కట్టే చైను ఆమె మెడకు బిగించి, స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. చైన్ బిగుసుకుని ఆక్సిజన్ అందని కారణంగా కోమాలో కెళ్లిన అరుణను మర్నాడు ఉదయం చూశారు. ఎంత చికిత్స అందించినా ఆమెను కోమా నుంచి బయటకు తీసుకురాలేక పోయారు. ఆ పరిస్థితిలో ఆమెకు మేమున్నామంటూ ముందుకొచ్చారు సాటి నర్సులు. అప్పటినుంచీ ఆమె బాగోగులు వారే చూసుకున్నారు. అప్పట్లో ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు చేపట్టాలంటూ నర్సులు ధర్నాలు కూడా చేశారు. అలా సుమారు నలభై ఏళ్ళు కోమాలో గడిపి 2015లో మరణించింది అరుణ. ఈమె గురించి విని చలించి పోయిన పింకీ వీరాని అనే రచయిత్రి అరుణ కథని ప్రపంచానికి తెలియజేయడమే కాక ఆమెకు కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీం కోర్ట్ మెట్లు ఎక్కింది. ఆమె వినతిని తోసిపుచ్చినా…తర్వాత చట్టంలో కొన్ని మార్పులు చేశారు.

2012లో…
నిర్భయ ఢిల్లీలో ఫిజియోథెరపీ విద్యార్థిని. చదువు పూర్తిచేసి కుటుంబానికి అండగా ఉండాలనుకుంది. ఒకరోజు సినిమాకెళ్లి ఇంటికొస్తుంటే దారిలో ఆపి మరి సిటీ బస్ ఎక్కించుకున్నారు. ఆమెతో పాటు స్నేహితుడు కూడా ఉన్నాడు. బస్సు డ్రైవర్, క్లీనర్, వారి స్నేహితులు అతి దారుణంగా నిర్భయను హింసించి అత్యాచారం చేసి రోడ్డు మీద పడేశారు. ఆమె స్నేహితుడినీ తీవ్రంగా కొట్టారు. మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలింది నిర్భయ. దేశరాజధానిలో జరిగిన ఈ సంఘటన యావద్దేశాన్నీ కదిలించింది. మహిళల రక్షణ కోసం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది.

2019లో…
దిశ మూగ జీవాలకు సేవచేసే వైద్యవృత్తిలో ఉంది. పని మీద బయటికెళ్లి ఇంటికొచ్చే క్రమంలో బండి పాడయింది. దగ్గరలోనే టోల్ బూత్ ఉంది. సమీపం నుంచి ఆమెని గమనిస్తున్న దుర్మార్గులు ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న దిశ మరణం ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వాన్ని కదిలించింది. దిశ పేరిట మహిళల రక్షణకు కొన్ని చర్యలు చేపట్టేలా దోహద పడింది.

2024 …
అభయ వైద్యురాలు. కోల్ కత్తాలో ప్రముఖ ఆస్పత్రిలో పని చేసేది. నైట్ డ్యూటీ చేసి అలసిపోయి కాన్ఫరెన్స్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి వెళ్ళింది. మాటేసి ఉన్న మానవమృగాలు అమానుషంగా ఆమెని బలితీసుకున్నాయి. మరోసారి దేశమంతా అట్టుడుకుతోంది. వైద్యులు, సామాన్యులు రోడ్డెక్కారు. రోజుకో కొత్త విషయం బయటికొస్తోంది.

పనిచేసే చోట భద్రత లేని వాతావరణం ఆందోళనగా, ఉద్యమంగా మారుతోంది. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వాన్ని వేయి గొంతుకలతో ప్రశ్నిస్తోంది. బేటీ బచావో – బేటీ పడావో నినాదం తర్వాత… ముందు రక్షణ చర్యలు చేపట్టమని ఈ దేశపు ఆడపిల్ల అడుగుతోంది.

దేశమా!
వినపడుతోందా?

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్