ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ పాత బస్తీలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం యువత బుధవారం పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా చార్మినార్, శాలిబండ, హుస్సేనీ ఆలం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు మరింత పెంచారు. సాయంత్రం 7 గంటల వరకే దుకాణాలకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత అన్నింటినీ మూసివేయాలని విజ్ఞప్తిచేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాల్లో కలియ తిరుగుతున్న పోలీసులు.. 7 గంటలకే అన్ని వ్యాపారాలు మూసేయాల్సిందిగా మైకులో అనౌన్స్‌మెంట్స్ ఇస్తుండటాన్ని బట్టి చూస్తే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మంగళవారం అర్థరాత్రి జరిగిన పలు హింసాత్మక ఘటలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సౌత్ జోన్ పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దింపారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్.. నగర పౌరులు అల్లర్లకు పాల్పడొద్దని హెచ్చరించింది. పాతబస్తీలో పలుచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ చేయగా సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు జరిగింది. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్న పోలీసులు, పాతబస్తీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రగతిభవన్ లో పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, ఇద్దరు ఐజీలు, మూడు కమిషనరేట్ల సీపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, ఘటనలపై సీఎం మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా గత రెండ్రోజుల నుంచి హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న ఘటనలపై కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.
Also Read : ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు