తెలుగుదేశం పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాయబారం చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆమె గతంలో కాంగ్రెస్ లో ఉన్నా, ఇప్పుడు బిజెపిలో ఉన్నా తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అంటూ ఏదీ లేదని, గతంలో చంద్రబాబు కంటే తక్కువ మద్యం అమ్మకాలు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. కానీ పురంధేశ్వరి లిక్కర్ పై విచారణ పేరుతో ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిసింది బాబును కాపాడేందుకేనని, బాబుకు సహాయం చేస్తే మొత్తం టిడిపిని బిజెపిలో కలుపుతామని హామీ ఇచ్చారని, బాబుకు సాయం చేస్తే తెలుగుదేశం పార్టీని పాదాక్రాంతం చేసేందుకు సిద్ధపడ్డారన్నది తనకు తెలిసిన సమాచారం అని అంబటి వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్న పురంధేశ్వరి… ఇటీవల మంత్రి రోజాపై టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు, దూషణ భూషణలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 2014 లో కేవలం టిడిపిని అందలం ఎక్కించేందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని, ఆయన పీకే కాదని కేకే అని అంటే కిరాయి కోటిగాడు అని అభివర్ణించారు. కేవలం బాబు పార్టీని కాపాడాలనే దృక్పథంతోనే రాజకీయాలు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన చేసే ప్రతి ప్రయత్నం వల్లా టిడిపి బలహీనం అవుతుందన్నది తెలుసుకోవాలని సూచించారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడం పవన్ కు అలవాటు అయ్యిందని, కాపుల ఓట్లను గుత్తగా తీసుకొని బాబుకు అమ్మాలనే ఆయన పార్టీ పెట్టారని..ఈ విషయాన్ని పవన్ వెంట ఉన్న ప్రజలు గమనించారని, అందుకే ఇది జన సేన కాదు బాబు సేన అని తెలుసుకున్నారని రాంబాబు పేర్కొన్నారు.