Sunday, January 19, 2025
HomeTrending Newsమేం చూస్తూ ఊరుకోం: పువ్వాడ అజయ్

మేం చూస్తూ ఊరుకోం: పువ్వాడ అజయ్

శ్రీశైలం వద్ద నీటికి బొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు దాకా నీటిని తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ గాజులు తొడుక్కొని లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కృష్ణాజలాలలో వాటా లేని ప్రాంతాలకు నీటిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మా ఖమ్మం జిల్లాకు రావాల్సిన నీటిని ఎవరైనా దొంగతనం చేస్తుంటే దొంగ అంటాము కానీ దొర అనే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, అడవిమల్యాలలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై పువ్వాడ స్పందించారు.

తెలుగుగంగ ద్వారా కేవలం 1400 క్యూసెక్కుల నీటిని మద్రాస్ తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు కట్టారని, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాని సామర్ధ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచారని, ఇప్పుడు అయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ దాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు పెట్టారని పువ్వాడ వివరించారు. 810 అడుగుల వద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణాలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నోట్లో మట్టికొట్టే విధంగా ప్రయత్నాలు చేసున్నారని విమర్శించారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి ప్రాంతం పూర్తిగా నాగార్జున సాగర్ జలాలపైనే ఆధారపడి ఉందని చెప్పారు.

తాము కూడా పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదని, అదే సమయంలో రాష్ట్ర నీటి వాటా విషయంలో ఎందాకైనా పోరాడతామని తేల్చి చెప్పారు. అవసరమైతే మా హక్కుల కోసం దేవుడితోనైనా పోరాడతామని కేటియార్ చెప్పిన విషయాన్ని మంత్రి అజయ్ గుర్తు చేశారు. తెలంగాణాను సాధించిన పోరాటయోధుడు కేసియార్ ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్ర జలాల విషయంలో రాజీ ప్రసక్తే లేదని అజయ్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకునేందుకు సిఎం కెసియార్ ప్రణాళికలు రచించారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్