Wednesday, January 22, 2025
HomeTrending NewsPCC: అమరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతి - రేవంత్ రెడ్డి

PCC: అమరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతి – రేవంత్ రెడ్డి

అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచారని, ఇందులో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తు చేయాలని.. కానీ అమరుల త్యాగాలను రాజకీయ స్వార్థానికి కేసీఆర్ ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని.. అమరుల బలిదానాలను కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారన్నారు. త్యాగాలు చేసిన వారిని అవమానించేలా బీఆర్ఎస్ వ్యహరిస్తోందన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి 2017, జూన్ 17న ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. డిజైన్, అంచనాల కోసం, పనులను పరిశీలించడానికి 6 శాతం ఫీజు చెల్లించాలని పేర్కొంది. 2018, జూన్ 28న నిర్మాణం కోసం రూ. 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 వ్యయంతో టెండరు ప్రకటన ఇచ్చారు. ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందన్నారు. కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకుంది. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్ తో కలిసాక కేపీసీ ప్రాజెక్స్ట్ లిమిటెడ్ గా మారింది. కంపెనీ ప్రొద్దుటూరు, కడప జిల్లాకు చెందిన వారిది. కేపీసీ కంపెనీ అడ్రెస్ విజయవాడకు మారిందన్నారు. తేలుకుంట్ల శ్రీధర్ కేటీఆర్ స్నేహితుడు. కేపీసీ ప్రాజెక్స్ట్ అనిల్ కుమార్ కామిశెట్టి తో వ్యూహాత్మకంగా తేలుకుంట్ల శ్రీధర్ కేటీఆర్ కు మేలు జరిగేలా చేశారు. దీంతో నిర్మాణ అంచనా వ్యయం 127 కోట్ల 50 లక్షలకు పెరిగింది. అయినా సరిపోదని 158.85 కోట్లకు, తర్వాత రూ. 179 కోట్ల 5 లక్షలకు అంచనా వ్యయం చేరిందన్నారు.
ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని మాత్రమే రాసి సరిపెట్టడం సరికాదన్నారు. శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చరిత్రను మలినం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలన్నారు. వందలాది మంది వీరుల త్యాగాలను కేసీఆర్ కాలగర్భంలో కలిపేశారన్నారు. రూ. 63 కోట్లతో మొదలైన అమరుల స్మారకం నిర్మాణం రూ. 179 కోట్ల 5 లక్షలకు చేరింది. దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
“అమరుల స్మారకం అంటే తెలంగాణ అమరుల చరిత్ర కళ్లముందు మెదిలేలా ఉండాలి. ఒక శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య… వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలి. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారు.
“అమరవీరుల స్థూప నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా నాణ్యత పాటించలేదు. నిజంగా మీకు అమరవీరులంటే గౌరవం ఉంటే ఇలా చేసేవారా. ఎలివేషన్ లో ఉపయోగించింది స్టెయిన్ లెస్ స్టీల్ . 4ఎంఎం పలుచని స్టెయిన్ లెస్ స్టీల్. దీంతో షీట్ కు షీట్ కు మధ్య గ్యాప్ లు ఉన్నాయి. అడవుల్లో సామాన్యులు కట్టిన స్థూపాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. నగరం నడిబొడ్డున అమరుల స్మారకంలో వాడిన స్టెయిన్ లెస్ స్టీల్ 8 ఎంఎం ఉపయోగిస్తామని అంచనా వేసి 4 ఎంఎం వాడారు. దీంతో స్థూపం దగ్గరికి వెళ్తే సొట్టలు, స్టీల్ షీట్లను జాయింట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం అవినీతికి కారణం కేటీఆర్, ఆయన స్నేహితుడు శ్రీధర్. తమ దోపిడీకి అమరుల స్మారకాన్ని కూడా వాడుకున్నారు” అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కూడా పుల్లయ్య కంపెనీకే ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్ తో విచారణ చేయిస్తామని అందులో అవినీతి పాల్పడిన వారిని చర్లపల్లి జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శతాబ్ది దగా నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని, పోలీసులతో సీఎం కేసీఆర్ రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హజ్ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు.
బండి సంజయ్ మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలను బండి సంజయ్ కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎడవలేక, పట్టిన చెమట తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. సానుభూతి వ్యక్త పరచడం తప్ప ఆయన మాటలను సీరియస్ గా తీసుకోలేమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్