Quality Drinking Tap Water :
First Indian city to achieve 24×7 purified drinking water from Tap
ఇంగ్లీషు దిన పత్రికల మొదటి పేజీలో ఒరిస్సా ప్రభుత్వ ప్రకటన ఒకటి చాలా ఆకర్షణీయంగా ఉంది. భాష, భావం, డిజైన్, ఉద్దేశం అన్నీ చక్కగా ఉన్నాయి.
సందర్భం
దేశంలోమునిసిపాలిటీ కొళాయి నీరు నేరుగా పట్టుకుని తాగడానికి వీలుగా శుద్ధి చేసి సరఫరా చేస్తున్న తొలి నగరం – పూరీ. దీని ప్రారంభం సందర్భంగా ప్రకటన.
విషయం
ప్రపంచంలో లండన్, న్యూయార్క్, సింగపూర్ లాంటి నగరాల్లో తాగేనీటిని శుద్ధి చేసి నగరపాలక సంస్థలు ఇంటింటికి కొళాయిల ద్వారా సరఫరా చేస్తున్నాయి. భారతదేశంలో ఏ నగరం, పట్టణంలో ఇలాంటి తాగునీటి వ్యవస్థ లేదు. పూరీ పుణ్యక్షేత్ర ప్రజలు రెండున్నర లక్షల మందికి, ఏటా పూరీకి వచ్చే రెండు కోట్ల మంది భక్తులకు శుద్ధి చేసిన నీటిని 24 గంటలూ సరఫరా చేసే అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సంకల్పం
పూరీని ప్రపంచ స్థాయి దర్శనీయ క్షేత్రంగా, అందంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంకల్పానికి ప్రతిరూపంగా ఈ ప్రాజెక్ట్ రూపు దిద్దుకున్నట్లు ప్రకటనలో ఉంది.
ఫలితం
ఈ ప్రాజెక్టుతో ఏటా పూరీలో కనీసం మూడు కోట్ల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గుతుంది. నాలుగు వందల టన్నుల అంటే పెద్ద కొండంత ప్లాస్టిక్ వినియోగం అవసరమే ఉండదు. ఒరిస్సాలో సమీప భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు మరో 16 పట్టణాలకు విస్తరిస్తుంది.
భాషలో హుందాతనం
ప్రకటనలో విషయం ఎంత శుద్ధమయినదో, ఇంగ్లీషులో ప్రకటన భాష కూడా అంతే శుద్ధంగా, హుందాగా ఉంది.
“Puri becomes India’s first city to drink straight from the tap – With purity of purpose”
పూరీ ఊరి ప్రస్తావనను ప్యూరిటీ అన్న మాటతో పర్పస్ ఫుల్ గా ప్రయోగించారు. పూరీ జగన్నాథుడి ఆలయం నుండి శుద్ధమయిన నీరు నేరుగా పైపులో వచ్చి కొళాయిలో పడుతోంది. ఇలా సరఫరా చేస్తున్న మొదటి నగరానికి సింబల్ గా కొళాయి పైపులోనే ఒకటిని ఆవిష్కరించారు. అద్భుతమయిన ఐడియా. సృజనాత్మక డిజైన్. చాలా పవిత్రమయిన ప్రెజెంటేషన్.Quality Drinking Tap Water
అన్నిటికీ మించి మూడు కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు వాడాల్సిన పనిలేదు, నాలుగు వందల టన్నుల ప్లాస్టిక్ వినియోగాన్ని తప్పించవచ్చు అన్నారే కానీ- ఈ ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఖర్చయ్యిందో చెప్పనేలేదు. ఉద్దేశపూర్వకంగానే చెప్పి ఉండరు. ఆ సంఖ్య చెప్పి ఉంటే ఈ ప్రకటనకు ఇంత విలువ వచ్చేది కాదు. ఏ అంకెలు చెప్పాలో? ఏవి చెప్పకూడదో? తెలియాలి. అదో కళ.
నేరుగా పట్టుకుని తాగడానికి వీలుగా శుద్ధిచేసిన కొళాయి నీటిని సరఫరా చేస్తున్న ఒరిస్సాను, ఆ ముఖ్యమంత్రిని, ఇంత భావగర్భిత ప్రకటనను తయారు చేసినవారిని అభినందించాలి.
భవిష్యత్తులో దేశమంతా పూరీ శుద్ధజల స్ఫూర్తి కొళాయిల్లో ప్రవహించాలని కోరుకుందాం.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read: