Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాహుల్ కు తెలిసిన సావర్కర్

రాహుల్ కు తెలిసిన సావర్కర్

Comments- Cost: లఘు పూజ నుండి పెద్ద యజ్ఞం వరకు దేనికయినా ఫలశ్రుతి ఉంటుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసమో, పిల్లల పెళ్లిళ్లు కావాలనో, ఎన్నికల్లో గెలవాలనో…ఇలా ఏదో ఒక కోరిక లేకుండా పూజా పునస్కారాలు సాధారణంగా ఉండవు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు చేస్తున్న “భారత్ జోడో” పాదయాత్ర పెద్ద యజ్ఞమే. దక్షిణ భారతం దాటి యాత్ర ఉత్తరాదిలోకి ప్రవేశించింది.

ఇంతకూ ఈ యజ్ఞానికి సంకల్పం రాహుల్ ఏమి చెప్పుకుని ప్రారంభించారో కానీ…ఫలశ్రుతి ఏమీ ఉండదని ముందే తేలిపోతోంది. ఆయన కాశ్మీరులో గుమ్మడికాయ కొట్టి మంగళం పాడే నాటికి ఆసేతు హిమాచలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ చోడో గీతం పాడేలా ఉన్నారు.

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.

యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించింది. రాహుల్ కు ఎవరు సలహా ఇచ్చారో కానీ…మరాఠా నేల వీరుడిగా ఆరాధించే వీర్ సావర్కర్ వీరుడే కాదు…బ్రిటీషువారి క్షమాభిక్షకోసం అర్రులు చాచిన పిరికివాడు…అని ఏదో ఒక ఉత్తరాన్ని సాక్ష్యంగా చూపుతూ రెచ్చిపోయారు. నిజానికి రాహుల్ చూపుతున్న సావర్కర్ ఉత్తరం కొత్తది కాదు. చరిత్ర పుటల్లో నలుగుతున్నదే. నిజమయినదే. ఎటొచ్చి…సమయం సందర్భం తెలియని రాహుల్ ముందుకు ఆ ఉత్తరం తెచ్చిందెవరో కానీ…వారికి మహారాష్ట్ర బి జె పి రుణపడి ఉండాలి. లేదా రాహుల్ తనకు తానే చరిత్రను తవ్వుకుంటూ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ అయినా ఉండాలి. ఏమయినా రాహుల్ ఎంత తిరిగితే తమకు అంత లాభం అని బి జె పి సంబరపడే రోజులొచ్చాయి.

ఎక్కడయినా సాధారణంగా అపోజిషన్ ఆరోపణలు చేస్తే...రూలింగ్ పార్టీ వణికిపోయి వివరణలు ఇచ్చుకుంటూ ఉండాలి. రాహుల్ విషయంలో ఇది రివర్స్. రాహుల్ ఏదన్నా అనగానే వణికిపోయి…కాంగ్రెస్సే వివరణలు ఇచ్చుకుంటూ ఉండాలి.

తప్పో…ఒప్పో…సావర్కర్ ను మరాఠా గడ్డ నెత్తిన పెట్టుకుని పూజిస్తోంది. ఆయన బ్రిటిషువారి కాళ్ల మీద పడ్డాడా? లేదా? అన్న చర్చ ఇక్కడ అనవసరం.

సావర్కర్ ను విమర్శించడం వల్ల రాహుల్ కు, కాంగ్రెస్ కు కలిగే ప్రయోజనాలివి.
1. మహారాష్ట్రలో మహా ఘట్ బంధన్ నుండి ఉద్ధవ్ ఠాక్రే బయటికి వెళ్లిపోతారు.
2. ఎంతో కొంత మహారాష్ట్రలో పట్టు నిలుపుకున్న కాంగ్రెస్ మళ్లీ చతికిల పడుతుంది.
3. షిండే సేన, బి జె పి రొట్టె విరిగి నేతిలో పడుతుంది.
4. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ప్రచారం చేయడానికి బి జె పి చేతికి మరో అస్త్రం దొరికింది.
5. గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు నష్టం జరగవచ్చు.
6. ఒక్కో రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుంటే…ఆయా రాష్ట్రాల్లో సావర్కర్ లాంటి అంశాలేమున్నాయో బి జె పి వారు ఒక అజెండాగా రాహుల్ చేతిలో పెడుతూ ఉంటారు.
7. కాశ్మీర్ లో రాహుల్ కాశ్మీర్ విషయం మాట్లాడితే చాలు. 2024 ఎన్నికల్లో గెలుపు సూత్రానికి బి జె పి కి ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది.

ఒకనాటికి కాంగ్రెస్ ను రాజకీయ పార్టీగా కాకుండా దేశంలో సెక్యులర్ భావాల వ్యాప్తికి, పరిరక్షణకు మాత్రమే కట్టుబడి పనిచేసే…ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయని స్వచ్చంద సంస్థగా ఏమన్నా మార్చాలని రాహుల్ కంకణం కట్టుకున్నారో? ఏమో?

రాహుల్ జీ!
ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు.
తథాస్తు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సామాన్యుడి గోచీ విలువెంత?

Also Read :

ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్