Mega Mouli: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నాటకలోని చిక్క బళ్లాపూర్ లో భారీగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కోసం భారీ స్టేజ్ ను ఏర్పాటు చేశారు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ “కర్ణాటక చక్రవర్తి హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయనను అంతా శివన్నా అంటూ ఉంటారు. నేను కూడా అలాగే పిలుస్తాను. భౌతికంగా మన మధ్య లేకపోయినా.. మనందరి హృదయాల్లో పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు. ఆయన మనందరి మనస్సులో ఉండటం వల్లనే ఆయన సినిమా ‘జేమ్స్’ అంత సూపర్ హిట్ అయింది. ఇక్కడే ఉండి తన ఆశీస్సులు ఆయన అందజేస్తూ ఉంటారు. చేస్తే.. పెద్ద సినిమానే చేయాలనే ఉద్దేశంతో ఇన్నేళ్లు నా కోసం వెయిట్ చేసిన మా నిర్మాత దానయ్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాను”.
“ఇక్కడ నేను ఒక అపూర్వమైన సంగమాన్ని చూస్తున్నాను. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు.. మన సూపర్ స్టార్స్ ఎన్టీఆర్ .. చరణ్ వాళ్ల మైత్రీ సంగమం ఈ స్టేజ్ పై జరుగుతోంది. తెలుగు, కన్నడ చిత్రపరిశ్రమలకి సంబంధించిన అభిమానులు ఇక్కడ ఉన్నారు. వాళ్ల సంగమాన్ని ఇక్కడ చూస్తున్నాను. అలాగే బంగాళాఖాతం హోరులాగా వాయిస్ ను వినిపిస్తున్న మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు. అరేబియా సముద్రం ఘోష లాగ వాళ్ల గొంతులు వినిపిస్తున్న నందమూరి అభిమానులు ఇక్కడ ఉన్నారు. వాళ్ల సంగమాన్ని ఇక్కడ చూస్తున్నాను”
“ఇదంతా చూస్తుంటే… శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. ఈ సంగమం.. ఈ మైత్రీ బంధం .. ఈ ఫ్రెండ్షిప్ .. ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా టిక్కెట్ల రేటు విషయంలో ఎంతగానో సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యేలా కృషి చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనను చాలామంది చాలా మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి తగ్గి ఆయన ఆ మాటలన్నీ పడ్డారు. చిరంజీవి సార్.. యూ ఆర్ ఏ ట్రూ మెగాస్టార్” అంటూ అభినందనలు తెలియజేశారు రాజమౌళి.