నితిన్ హీరోగా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ సినిమా చేశాడు. దర్శకుడిగా వక్కంతం వంశీ ఈ సినిమాను రూపొందించాడు. నితిన్ పేరెంట్స్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 8వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, నిన్న రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ సినిమాలో ఒక మ్యుఖ్యమైన పాత్రను పోషించిన రాజశేఖర్ కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఇంతవరకూ హీరోగా మాత్రమే కనిపిస్తూ వచ్చిన రాజశేఖర్, ఈ తరహా రోల్ చేయడం ఇదే ఫస్టు టైమ్.
ఈ పాత్ర కోసం ఆయనే కావాలని చెప్పి ఒప్పించమనీ, ఎందుకోసమనేది థియేటర్ కి వెళ్లిన తరువాత తెలుస్తుందని దర్శకుడు వక్కంతం వంశీ అన్నాడు. ఇక ఇండస్ట్రీలో డిస్ట్రీబ్యూటర్ గా తన తండ్రి కెరియర్ రాజశేఖర్ సినిమాతోనే మొదలైందనీ, ఆ సినిమా లాభాలను తెచ్చిపెట్టడం వల్లనే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారని నితిన్ చెప్పాడు. తన తండ్రి ఇండస్ట్రీలో ఉండటం వల్లనే హీరో కావాలనే తన ప్రయత్నం ఫలించిందనీ, అందుకు రాజశేఖర్ గారు ఒక కారణంగా తాను భావిస్తూ ఉంటానని అన్నాడు.
తన తండ్రి కెరియర్ రాజశేఖర్ గారి సినిమాతో మొదలైతే, తన సినిమాతో రాజశేఖర్ గారికొత్త జర్నీ మొదలుకావడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ సినిమా రాజశేఖర్ గారి కంటే .. ఆయన చేయడం వలన తమకి ఎక్కువగా హెల్ప్ అయిందని అన్నాడు. ఒక సీనియర్ హీరోగా రాజశేఖర్ ను గౌరవిస్తూ .. ఆయనను కేంద్రంగా పెట్టుకుని దర్శక నిర్మాతలు .. హీరో మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ తరహా పాత్రలను చేయడంలో కూడా రాజశేఖర్ బిజీ అవుతారని అనుకోవచ్చు.