Sunday, January 19, 2025
Homeసినిమారూట్ మార్చిన రాజశేఖర్ 

రూట్ మార్చిన రాజశేఖర్ 

రాజశేఖర్ హీరోగా సుదీర్ఘమైన కెరియర్ ను చూశారు. యాంగ్రీ యంగ్ మేన్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. బయట బ్యానర్లలో .. తన సొంత బ్యానర్లో వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి .. ఒకరకంగా ఆయన కెరియర్ ను నిలబెట్టాయి కూడా. అదే సమయంలో ఫ్యామిలీ హీరోగాను ఆయన నిరూపించుకున్నారు. అయితే ఒకానొక దశలో హీరోగా ఫ్లాపులు .. నిర్మాతగా నష్టాలు ఆయనను చుట్టుముట్టాయి. అప్పటి నుంచి ఆయన సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే విలన్ వేషాలు కూడా ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నిజానికి రాజశేఖర్ కళ్లు .. ఆయన బాడీ లాంగ్వేజ్ పవర్ఫుల్ విలనిజానికి ప్లస్ అవుతాయి. అందువలన పెద్ద సినిమాల నుంచి విలన్ రోల్స్ ను చాలా సంస్థలు ఆఫర్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పాత్రలను చేయలేకపోయానని ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ స్వయంగా చెప్పారు. పెద్ద పెద్ద స్టార్స్ అంతా విలన్ గా ప్రయోగాలు చేయడానికి వెనుకాడని ట్రెండ్ ఇది.

అందువలన రాజశేఖర్ కూడా విలన్ గా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. తన స్థాయికి తగిన కీలకమైన రోల్స్ లో కనిపించినా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాంటివారి ముచ్చట త్వరలో తీరనుందని స్పష్టమైంది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మెన్’ సినిమాలో రాజశేఖర్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి ఈ తరహా పాత్రలలో ఆయన బిజీ అవుతారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్