Mini Review: రజనీకాంత్ తో సినిమా తీయడానికి కాదు .. ఆయనకి కథ చెప్పడానికే ధైర్యం కావాలి. ‘ఇక్కడ ఇలా ఉండాలి సార్’ అనే మాట, ఆయన కెమెరా ముందు ఉన్నప్పుడు చెప్పడానికి ధైర్యం కావాలి. అలా చెప్పగలగాలంటే ఆ కథలో విషయం ఉండాలి .. అది రజనీ స్థాయికి తగినదై ఉండాలి .. ఆయన అనుకున్నట్టుగానే ఆ సీన్ తీయగలమనే కాన్ఫిడెన్స్ దర్శకుడికి ఉండాలి. ఎందుకంటే రజనీకి ఉన్న అనుభవం అలాంటిది. ఆయనకి ఏం కావాలనేది సీనియర్ దర్శకులకు తెలుస్తుంది గనుక ఫరవాలేదు. కానీ కెరియర్ ఆరంభంలోనే ఉన్న నెల్సన్ వంటి దర్శకులకు అది ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.
రజనీ అంటేనే స్టైల్ .. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లోనే ఉంటాయి. అలాంటిది మళ్లీ యాక్షన్ సీన్స్ ఆయనతో చేయించేటప్పుడు, వాటిని డిఫరెంట్ గా డిజైన్ చేయించాలి. అలా డిజైన్ చేయించిన ఫైట్స్ మనకి ‘జైలర్’ సినిమాలో కనిపిస్తాయి. ఈ సినిమాలో తన కొడుకును తనకి దూరం చేశారనే కోపంతో హీరో చేసిన పనులు, విలన్ ను రెచ్చగొడతాయి. దాంతో హీరో సంగతేంటో చూడమని ఆ విలన్ ఒక రాత్రివేళ తన గ్యాంగ్ ను పంపిస్తాడు. అయితే రానున్న ప్రమాదాన్ని హీరో ముందుగానే పసిగడతాడు.
మంచి నిద్రలో ఉన్న తన మనవడిని శత్రువుల కంటపడకుండా దాచిపెడతాడు. తన భార్యను .. కోడలిని నిద్రలేపి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. విలన్ తో తాను గొడవపడిన విషయం .. అతని మనుషులు తమని చంపడానికి వస్తున్న సంగతి చెబుతాడు. కళ్లముందు ఏం జరుగుతున్నా కదలకుండా చూస్తూ కూర్చోమని అంటాడు. అంతలో విలన్ గ్యాంగ్ కత్తులు .. కటార్లతో ఆ ఇంట్లోకి ఎంటరవుతుంది. ఆ తరువాత అక్కడ జరిగే సీన్ ఆడియన్స్ ను సీట్లలో నుంచి కదలనివ్వదు. సినిమాలో కొత్తగా అనిపించే ఫైట్స్ చాలానే ఉన్నప్పటికీ, ఈ సీన్ ఆడియన్స్ పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు.