రజనీకాంత్ .. విష్ణు విశాల్ .. విక్రాంత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘లాల్ సలామ్’ ఈ రోజున థియేటర్లకు వచ్చింది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. జీవిత ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాలో కథానాయకుడు రజనీకాంత్ అనే అంతా అనుకున్నారు. అలాంటి మెసేజ్ వెళితే ఆడియన్స్ అసంతృప్తి చెందుతారని భావించి, విష్ణు విశాల్ – విక్రాంత్ పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయని చెబుతూ వచ్చారు.
కథ సంగతి అలా పక్కన పెడితే, రజనీ ఏ సినిమాలో ఉన్నా ఆయననే కథానాయకుడిగా భావిస్తారు. ఈ సినిమా కథ విషయానికొస్తే, గ్రామీణ వాతావరణం .. అక్కడ జరిగే రాజకీయాలు .. అల్లర్లు .. అలాంటి అంశాలన్నీ కనిపిస్తాయి. మరో వైపు నుంచి ఈ కథకి క్రికెట్ నేపథ్యం ముడిపడి కనిపిస్తుంది. ముంబైకి చెందిన బిజినెస్ మెన్ మొయిద్దీన్ పాత్రలో రజనీ తనదైన స్టైల్లో ఆడియన్స్ ను ప్రభావితం చేయడానికి తనవంతు ప్రయత్నం చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
ఐశ్వర్య రజనీకాంత్ రాసుకున్న ఈ కథలో వైవిధ్యం కనిపించదు. అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చినట్టుగా తెరపైకి ఒకదాని తరువాత ఒకటిగా సన్నివేశాలు వస్తుంటాయి .. పోతుంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి సీన్స్ చూశాం కదా అనే ఆడియన్స్ కి అనిపిస్తూ ఉంటుంది. కథలో వైవిధ్యం లేకపోవడం .. కథనంలో వేగం లేకపోవడం .. సందేశాన్ని బలంగా చెప్పకపోవడం ప్రధానమైన లోపాలుగా కనిపిస్తాయి. విష్ణు విశాల్ .. విక్రాంత్ ఇక్కడి ఆడియన్స్ కి అంతగా తెలియకపోవడం కూడా, రెస్పాన్స్ తగ్గడానికి కారణంగా భావించవచ్చు.