అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, ఇప్పుడు దర్శకులంతా తెరపై అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. చారిత్రక .. పౌరాణిక .. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోని కథలను సెట్ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. రొటీన్ కథలతో విసిగెత్తి పోయిన ప్రేక్షకులు కూడా ఈ తరహా కంటెంట్ పట్ల ఆసక్తిని కనబరుస్తూ వెళుతున్నారు,
అలాంటి ప్రేక్షకులను అలరించడానికి తపించే దర్శకుల జాబితాలో ప్రశాంత్ వర్మ కూడా కనిపిస్తాడు. ఒక కథపై .. ఆ కథలో ఎక్కడెక్కడా ఎంత మోతాదులో గ్రాఫిక్స్ చేయించాలనే విషయంలో తనకి మంచి అవగాహన ఉందనే విషయాన్ని, ‘హను మాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ నిరూపించుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన అవుట్ పుట్ ను తెచ్చుకున్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు.
ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ‘రాక్షస’ అనే ఒక సినిమా చేయాలనుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. అయితే హీరోకి .. దర్శకుడికి మధ్య క్రియేటివ్ పరమైన విభేదాలు తలెత్తడం వలన, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోలేదనీ, త్వరలోనే ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ‘రాక్షస’ అటకెక్కిందనే ప్రచారానికి తెరదించారు.