Sunday, January 19, 2025
Homeసినిమాసంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం : రామ్ చరణ్

సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం : రామ్ చరణ్

ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకం పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ “మా సినిమాలు ఆలస్యమైనా కూడా అభిమానులు ఎప్పుడూ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. మా అభిమానులే అని కాదు సినిమా అభిమానులంతా కూడా ఎదురుచూస్తున్నారు. మళ్లీ మన ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. సంధ్యారాజు గారు మా ఫ్యామిలీకి తెలుసు కాబట్టి ఇక్కడకు రాలేదు. మొన్నే సినిమాను చూశాను. మొదటి క్షణం నుంచి ఆఖరి నిమిషం వరకు ఎంతో అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ హిట్ సినిమాలను కూడా చూస్తూ మధ్యలో పడుకుంటాను. అలాంటి నేను ‘నాట్యం’ సినిమాను ఎంతో ఆసక్తిగా చూశాను. అన్ని కోణాల్లో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి ప్రయత్నం చేసిన రేవంత్‌ను అభినందిస్తున్నాను. రేవంత్‌ భవిష్యత్తులో ఇండస్ట్రీకి పెద్ద బలంగా మారుతాడనే నమ్మకం ఉంది”

“బాహుబలిలోని హంస అనే పాటకు దగ్గరగా తీశాడు. అన్ని పాటలు వినడానికి అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి చిత్రాలకు మ్యూజిక్ ఎంతో ముఖ్యం. శ్రవణ్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రాణం పెట్టి, కథను అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. కరుణాకర్ పాటలను అద్భుతంగా రాశారు. ఆదిత్య గారిని ఎన్నో పాత్రల్లో చూశాం. కానీ ఇలా తండ్రి, గురువు పాత్రలో కొత్తగా కనిపిస్తారు. ఇదే స్టేజ్‌లో సంధ్యా రాజు గారు దాదాపు ఏడేళ్ల క్రితం కూచిపూడి పర్ఫామెన్స్ చేశారు. కూచిపూడి నాట్యం, ఇలాంటి కల్చర్ మీద సినిమా తీస్తున్నారని సాయం చేసేందుకు వచ్చాను. మేం 20 మంది కలిసి సినిమా తీస్తే.. ఒకే ఒక అమ్మాయి ఇలాంటి సినిమాను తీసి సాధించారు. స్త్రీ శక్తి అంటే ఏంటో ఈ సినిమాతో చూడబోతోన్నారు. ఈ సినిమా తరువాత మీకంటూ ఓ నిర్మాత, దర్శకులు రావాలని అనుకుంటున్నాను. నిర్మాతగా సినిమాలు తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సంధ్యా రాజు గారి సంకల్పం కోసం ఈ సినిమాను మనం చూడాలి. సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మన లక్ష్యాలు నెరవేరుతాయి. ఇద్దరి సంకల్పం ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి ఈ సినిమా నిదర్శనం. అక్టోబర్ 22న ఈ చిత్రం రాబోతోంది. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం. రెస్టారెంట్లు,బార్లు అన్ని చోట్లకు వెళ్తున్నాం. థియేటర్లకు కూడా వెళ్దాం. మళ్లీ మన థియేటర్లకు పూర్వ వైభవం తీసుకొద్దాం. అఖిల్ సినిమా హిట్ అయిందని విన్నాను. ఇంకా చాలా చాలా సినిమాలు రాబోతోన్నాయి. కేవలం భరతనాట్యం గురించి మాత్రమే కాకుండా.. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. దాని కోసం ఈ చిత్రం చూడాలి. అమ్మాయి సంకల్పం, అబ్బాయి కష్టపడ్డ విధానానికి అందరం సినిమా చూడాలి” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్