Sunday, January 19, 2025
HomeTrending Newsఅభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు

అభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు

మూడేళ్ళ మూడు నెలల పాలనా కాలంలో సిఎం జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సిఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. అయన ప్రసంగం మొత్తం అర్ధ సత్యాలు, అసత్యాలు, అభూత కల్పనలతోనే సాగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరించామని సిఎం చెప్పారని, కానీ ఇసుక దొరక్క ఎందరో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మర్చి పోయారా అని ప్రశ్నించారు. జేపీ వెంచర్స్ పేరుతో మూడేళ్ళలో 15వేల కోట్ల రూపాయలు  ఇసుక మీద దోచుకున్నారని విమర్శించారు. ఈ ఏడు కూడా మరో ఐదు వేల కోట్లు దోచుకుని ఎన్నికల సంవత్సరంలో ఉచిత ఇసుక ఇవ్వాలని చూస్తున్నారని రామానాయుడు చెప్పారు.

చంద్రబాబు హయంలో వేలాది టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తే వీటిని ఈ ప్రభుత్వం కనీసం వాటిని లబ్ధిదారులకు అందించ లేకపోయిందన్నారు. పెన్షన్ల విషయంలో కూడా జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని…ఈ పాటికే వారికి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, జగన్ తాను సంతకం చేసిన మొదటి ఫైల్ కే విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. చిన్న చిన్న కారణాలతో కూడా పెన్షన్ తీసేస్తున్నారని చెప్పారు. టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి వస్తుందనే కారణంగానే స్కూళ్ళను విలీనం చేస్తున్నారని ఆరోపించారు.

మద్యపాన నిషేధాన్ని మూడంచెల్లో చేస్తానని చెప్పిన జగన్ 2025 వరకూ బార్ లైసెన్సులకు ఎలా అనుమతిస్తారని నిలదీశారు. బడులు మూసి బార్లు ఓపెన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్పోరేషన్ల పేరుతో వెనుకబడిన కులాలకు ఏ ఒక్క ఉపకారం కూడా అందలేదని, గతంలో తాము ప్రవేశ పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కాన్సెప్ట్ ను ఎత్తి వేశారని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్