రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలపైన అఖిల పక్షం పిలవాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్ లలో ఇంత దారుణాలు జరుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని హైదరాబాద్ లో మల్లు రవి మండిపడ్డారు. మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే 4 రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదని, అధికార పార్టీ నేతల బంధువులను కాపాడేందుకు పోలీస్ లు ప్రయత్నాలు చేస్తున్నారని మల్లు రవి ఆరోపించారు.
బాలిక అత్యాచారం కేసులో నిష్పక్ష పాతంగా విచారణ జరగడం లేదని, ప్రభుత్వం, పోలీస్ ల స్పందన లోపభూయిష్టంగా ఉందని మల్లు రవి విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు 120 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రకటనలా, ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే వృధా ఖర్చులు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే అవుతుందని, ప్రభుత్వ ధనంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రకటనలు దేశ వ్యాప్తంగా ఇస్తున్నారని మల్లు రవి ఆరోపించారు.