Saturday, January 18, 2025
Homeసినిమారష్మికకి ఆ రోల్ చేయాలని ఉందట!

రష్మికకి ఆ రోల్ చేయాలని ఉందట!

టాలీవుడ్ .. కోలీవుడ్ .. శాండల్ ఉడ్ .. బాలీవుడ్ .. ఇలా ఏ ఇండస్ట్రీ అయితేనేం .. అక్కడ రష్మిక చాలా గట్టిగానే జెండా పాతేసింది. వరుస అవకాశాలను అందుకుంటూ, స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా రానున్న ‘పుష్ప 2’ కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ‘గం గం గణేశా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన సినిమా ఇది.

ఈ సినిమా ఫంక్షన్ లో  .. తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని ఆమె చెప్పడం, ‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ’ అంటూ అనడం ఆడిటోరియంలో సందడిని పెంచింది. అంతే కాకుండా ఆమె ఆ ఫంక్షన్ కి వచ్చిన సాయిరాజేశ్ ను ఉద్దేశించి మాట్లాడారు. తనకి ఎంతో ఇష్టమైన సినిమా ‘బేబీ’ అని చెప్పారు. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి అతని దర్శకత్వంలో పనిచేయాలనే ఆలోచన ఏర్పడిందని అన్నారు. మానసికస్థితి సరిగ్గా లేని పాత్రను చేయాలనుందని చెప్పారు.

ఒకప్పుడు ‘వసంత కోకిల’ సినిమాలో శ్రీదేవి పోషించిన పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్స్, అలాంటి పాత్రను చేయడమే తమ డ్రీమ్ అంటూ చెప్పేవారు. ఆ మధ్య వరకూ ఈ మాట వినబడుతూనే వచ్చింది. మళ్లీ ఇప్పుడు అలాంటి పాత్రను చేయాలనుందని రష్మిక అనడం విశేషం. రష్మికకి ఆ పాత్రను చేయాలనుంది సరే .. కానీ ఆ పాత్రలో ఆమెను చూడటానికి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారా? అనేదే డౌటు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్