ఈ సంక్రాంతికి సందడి గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి సంక్రాంతికి పెద్ద సినిమాలు .. స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దిగుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంది. సంక్రాంతి అనేది రైతుల పండుగ మాత్రమే కాదు .. సినిమాల పండుగ కూడా అనే మాట చాలా కాలం క్రితమే వినిపించింది. పండగ సమయంలో జనం దగ్గర డబ్బులు ఉంటాయి .. సెలవులు దొరుకుతాయి. అందువలన సహజంగానే సినిమాలకి వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే సంక్రాంతికి బరిలో దిగే సినిమాల సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది.
ఈ సంక్రాంతి విషయానికి వస్తే మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ రంగంలోకి దిగుతోంది. త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో చాలా కాలం తరువాత వస్తున్న సినిమా కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక మరో వైపున నాగార్జున సినిమా ‘ నా సామిరంగ’ కూడా సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’కూడా సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇదే సమయంలో ‘ఈగల్’ సినిమాతో రవితేజ బరిలోకి దిగుతున్నాడు.
‘ఈగల్’ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే ఒక టాక్ వచ్చింది. గట్టి పోటీ ఉండటం వలన, ఈ సినిమా కాస్త తీరిగ్గా విడుదలవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందనే విషయం ఖరారైపోయింది. జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలలో ఏది ఎక్కువ రికార్డులను కొల్లగొడుతుందనేది చూడాలి.