Wednesday, January 22, 2025
Homeసినిమా'ఈగల్' ట్విస్టులు ఎవరూ గెస్ చేయలేరట!

‘ఈగల్’ ట్విస్టులు ఎవరూ గెస్ చేయలేరట!

హిట్లు .. ఫ్లాపుల లెక్కలు పక్కన పెడితే, రవితేజ నుంచి ఏడాదికి మూడు సినిమాలు థియేటర్స్ కి రావలసిందే. అదే ఆయన చూసే లెక్క .. ఆయన అభిమానులకు కావలసిన లెక్క. అలా వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన నుంచి రావడానికి ‘టైగర్ నాగేశ్వరరావు’ రెడీ అవుతూ ఉండగానే, మరో వైపున వేరే ప్రాజెక్టులను ఆయన సెట్ చేస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రాజెక్టులలో ఒకటిగా ‘ఈగల్’ కనిపిస్తోంది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బయట షికారు చేస్తోంది. కథ మొదలైన తరువాత ప్రతి పావుగంటకి ఒక ట్విస్ట్ తెరపైకి వస్తుందట. ఫలానా చోట .. ఫలానా ట్విస్టు పడొచ్చునని ఆడియన్స్ వేసుకునే అంచనాలు ఎప్పటికప్పుడు పక్కకి వెళ్లిపోతూ, వాళ్లకి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయని అంటున్నారు.

ఇక రవితేజ స్టైల్ గురించి .. ఆయన ఎనర్జీ లెవెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కానీ ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్ .. వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు. ఇలా రవితేజ మార్కును టచ్ చేస్తూనే ఆయనలోని కొత్త కోణాన్ని ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించడం జరుగుతుందని చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ .. కావ్య థాపర్ కథానాయికలుగా అలరించనున్నారు. వచ్చే ‘సంక్రాంతి’కి ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్