9.4 C
New York
Friday, December 1, 2023

Buy now

నా భాష

Originality- Beauty: నేను హైస్కూల్లో ఉన్నప్పుడు చదివిన నవలల్లో ఒకటి “దివిసీమ”. దివిసీమ ఉప్పెన మహోగ్రరూపం, దాని పరిణామాలను వివరించిన నవల. రచయిత సుబ్బయ్య గారిది ప్రొద్దుటూరు అని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గానీ తెలియలేదు. ఆ పుస్తకంలో వాడింది దాదాపు ప్రామాణిక భాషే గానీ తరచుగా రాయలసీమ వాడుక భాష రూపాలు తొంగిచూస్తాయి. ఆ రూపాలను ముద్రితరూపంలో చూడడం అదే తొలిసారి. అట్లా అంతకుముందెప్పుడూ చూడకపోవడం వల్ల అది తప్పు అని భావించి, ఎక్కడెక్కడైతే ఆ రూపాలు కనబడినాయో అక్కడంతా నా చాపల్యం కొద్దీ పెన్నుతో “సరి”దిద్దినాను. ఇప్పుడు ఆ దిద్దుబాట్లు చూస్తే సిగ్గేస్తాది.

ఆ తర్వాత నేను నా భాషను “సరిచేసుకోవడానికి” కారణం కడపలో ఒక డాక్టరు. ఆయన “మీ మాటలు విన్నవాళ్ళెవరూ మీరు కడప వాళ్లనుకోరు. గోదావరి జిలాల వారనుకుంటారు” అన్నప్పుడు నాలో, (బయటివాళ్లతో మాట్లాడేటప్పటి) నా మాటతీరులో నా ప్రాంతపు ఐడెంటిటీ ప్రమాదంలో పడిందని గుర్తించి, బయటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెచ్చిపెట్టుకునే ప్రామాణికతను పక్కకు తోసి వీలైనంతవరకు నా ప్రాంతపు భాషే వాడడం మొదలుపెట్టినాను. రాతలో కూడా ఈ మార్పు అవసరమనిపించి ఈ నడుమ మెల్లగా మార్చుకుంటున్నాను. ఇప్పుడు నేను రాసేది పూర్తి ప్రామాణిక తెలుగు కాదు. అట్లని మాండలికమూ కాదు. రెండిటి కలబోత. నేనిట్లా రాయడానికి కారణం కేవలం ప్రాంతీయాభిమానం కాదు. అంతకు మించి. అదేమిటంటే –

రానురాను తెలుగు భాష రాసేవాళ్ళూ చదివేవాళ్ళూ తగ్గిపోతున్నారనే ఆందోళన తరచూ వినబడతా ఉంది. ఒక భాష వాడకం పెరగాలంటే ఆ భాష వర్తమాన అవసరాలకు అనుగుణంగా మారాల. అది రెండు రకాలుగా జరగాల.

1. భాషలో పదసంపద పెరగాల.
2. దానితో పాటే వ్యాకరణం కూడా సరళం, సులభం, సుబోధకం కావాల.

పదసంపద పెరగాలనేదానితో ఏకీభవించేవాళ్ళకు కూడా వ్యాకరణం లేదా వాక్య నిర్మాణంలో ఏ రకమైన మార్పులు రావాలో తట్టకపోవచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ:

చేయు, ఉండు అనే రెండు సాధారణ క్రియల వివిధ రూపాలు ప్రామాణిక భాషలో కింది విధంగా రాస్తారు:

ఉత్తమ పురుష ఏకవచన రూపాలు: చేస్తాను, ఉంటాను
ఉత్తమ పురుష బహువచన రూపాలు: చేస్తాము, ఉంటాము
మధ్యమ పురుష ఏకవచన రూపాలు: చేస్తావు, ఉంటావు
మధ్యమ పురుష బహువచన రూపాలు: చేస్తారు, ఉంటారు
ప్రథమ పురుష ఏకవచన రూపాలు (మహద్వాచకం): చేస్తాడు, ఉంటాడు
ప్రథమ పురుష ఏకవచన రూపాలు (ఇతర వాచకాలు): చేస్తుంది, ఉంటుంది
ప్రథమ పురుష బహువచన రూపాలు (మహత్, మహతీ): చేస్తారు, ఉంటారు
ప్రథమ పురుష బహువచన రూపాలు (అమహత్): చేస్తాయి, ఉంటాయి

ఇన్నిటిలో స్త్రీ, నపుంసక ప్రథమ పురుష ఏకవచన రూపాలు మాత్రమే చేస్తుంది, ఉంటుంది అని ఎందుకు వేరుగా ఉండాల? So-called ప్రామాణిక భాషలో ఈ తుం-తుం లు, టుం-టుం లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి కన్విన్సింగ్ సమాధానం నాకు దొరకలేదు. అందుకే భాష వీలైనంత uniformగా, సరళమూ, సుబోధకంగా ఉండాలనే ఉద్దేశంతో “చేస్తాది, ఉంటాది” అని రాస్తాను. ఇవి నేను సృష్టించినవి కాదు. రాయలసీమలో మొదటి నుంచి వాడుకలో ఉన్న రూపాలే. (కమర్షియల్స్ లోనే “అల్లం దొరుకుద్దా?” అని మాండలిక రూపాలను చొప్పించడానికి గుంటూరోళ్ళకు లేని మొహమాటం, బెరుకు భాషను సరళీకృతం చెయ్యడానికి మనకెందుకు?)

నేను ఆన్‌లైన్‌లో పదైదేండ్లుగా రాస్తున్నాను. ఇన్నేండ్లలోనూ “పదైదు అంటే ఎంత?” అని అడిగేవాళ్ళను చూసి ‘పది+ఐదు కలిస్తే పదైదు అని నిజంగా వీళ్ళు తెలియకే అడుగుతున్నారా?’ అని విస్తుపోయాను. పదమూడు, పద్నాలుగు, పదహైదు, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది – ఇది సరళమైన వరస. మిగతావన్నీ అర్థమైనప్పుడు ఇదొక్కటీ అర్థం కాకపోవడమేమిటి? కొన్ని ప్రాంతాలవాళ్ళు పదిహేను అంటారు. “మధ్యలో ఏను ఎక్కడి నుంచి వచ్చింది?” అని అడిగితే భాషా చరిత్ర తెలిసిన ఏ కొద్దిమందో తప్ప మిగతావాళ్ళందరూ తెల్లమొహం వేసినారు. ‘పిల్ల పోయినా పీతి కంపు పోలేద’ని సామెత. (ఇంతకంటే మెరుగైన సామెత సమయానికి తట్టడం లేదు.) ఆ వాసనకు వాచ్య రూపమే పదిహేను. కంపును కడిగి తేటపరుస్తా ఉంటే అయోమయమెందుకు? మా రాయలసీమ వాడుక భాష పాతకాలానిదిగానే ఉంటాది గానీ నిజానికి గతకాల అవశేషాల బరువును వదిలించుకోవడంలో ముందుండి పాత కొత్తల మేలు కలయికగా తయారైంది. దీనికి ఇంకొక ఉదాహరణ:

గౌరవ సూచకంగా బహువచనంలో “అండి” వాడుతూ ఉంటాం. సందర్భం కొద్దీ ఎవరైనా “ఏమండీ” అంటారు గదా? అది ఎట్లా ఏర్పడింది? ఏమి+అండీ (ఇకార సంధి) కదా? అట్లే “రా”, “పో” అనే ఆదేశాలకు “అండి” చేరిస్తే బహువచనంలో “రాండి”, “పోండి” అవుతాయి: రా+అండి = రాండి, పో+అండి = పోండి. ఎంతమంది హిందీ వాళ్ళ మధ్య ఉన్నా “రాండి” అని ఱొమ్ము విరుచుకుని పిలవచ్చు 🙂. “రండి” అని అంత గట్టిగా పిలవలేం కదండీ (కదండీ కూడా ఇట్లా ఏర్పడిందే: కద+అండీ)? కాబట్టి ‘రండు’, ‘పొండు’ అనే గ్రాంథిక రూపాలకు తిలోదకాలిచ్చి సర్వే సర్వత్రా ఏకవచన రూపానికి అండి తగిలించడమే సులభగ్రాహ్యం.

ఎట్లాగూ సంఖ్యల్లోకి దిగినాం కాబట్టి ఒకసారి మనుషులను కూడా ఎంచుదాం: ఒకరు, ఇద్దరు, ముగ్గురు,… ఒకళ్ళు, ఇద్దళ్ళు, ముగ్గుళ్ళు,… ఏది సరైన వరస? రాయలసీమలో ‘వాళ్ళు’, ‘వీళ్ళు’ అంటారు. కానీ ఎందరు అన్నప్పుడు ‘ఒకరు’, ‘ఇద్దరు’, ‘ముగ్గురు’,… అనే అంటారు. నాజూకు భాష వాడేవాళ్ళు ‘వారు’, ‘వీరు’, ‘ఇద్దరు’, ‘ముగ్గురు’,… అంటారు. మధ్యలో ‘ఒకళ్ళు’ ఎక్కడినుంచి వచ్చింది? నాకు తెలియదు. నేను మాత్రం ఒకరు, ఇద్దరు, ముగ్గురు,… అనే రాస్తాను. మరి అదే వరసలో “వారు”, “వీరు” అని రాస్తానా? రాయను. రంగనాయకమ్మ “వాడుక భాషే రాస్తున్నామా?” అని నిలదీసి ప్రశ్నించింది. కాబట్టి “వాళ్ళు”, “వీళ్ళు” అని అందరికీ ఆమోదయోగ్యమైన నా వాడుక భాషే రాస్తాను😃.

మా రాయలసీమ వాడుక భాష పాతకాలానిదిగానే ఉంటాది అని పైన అన్నాను గదా? పాతకాలానిది అనేదెందుకంటే పట్టుకునేచోట బలంగానే పట్టుకుని ఉండాం. గతంలో నా బ్లాగులో ఏదో ఒక సందర్భంలో నూరు అని రాస్తే, ‘నూర్లు పెరిగితే రెండు నూర్లు, మూడు నూర్లు అనం గదా? రెండొందలు మూడోందలు అనాల్సిందే. అంతలో దానికి వంద అంటే పోదా? మళ్ళా నూరెందుకు?’ అన్నారు. పదులు పెరిగితే రెండు పదులు, మూడు పదులు కాకుండా ఇరవది, ముప్పది, నలువది అయినట్టే నూర్లు పెరిగే క్రమం ఇన్నూరు, మున్నూరు, నన్నూరు. (ఇక్కడ నాకు ఒక సందేహం కూడా ఉంది. ఎవరైనా తీర్చగలిగితే సంతోషం: 50ని యాభై అని ఎందుకంటారో తెలుసు, కానీ 70ని డెబ్భై అని ఎందుకంటారు? కన్నడంలో చక్కగా 50ని ఐదు పదులు కాబట్టి ఐవత్తు, 70ని ఏడుపదులు కాబట్టి ఎప్పత్తు, అట్లే 80ని ఎంబత్తు అంటారు.)

చాలా విషయాలు మాట్లాడేసినట్టున్నా. ఈ పూటకు అల్పాహారంతో ముగిద్దాం. టిఫెన్ చేద్దామని టిఫెన్ సెంటరుకు పోతే మెనూలో దోసెను Dosa అని రాసి పెడతారు. అది చూసి నా ఆకలి చచ్చిపోతాది. ఆ దిక్కుమాలిన ఇంగిలీషులో ‘దోసె’ అని రాస్తే, పలికే లోపల అది డోస్‌గా మారిపోతాది. ఇంగిలీషోడికి అరవోడి పద్ధతిలో Dosai/Dosei అని అలవాటు చేసి ఉన్నా ఈ దోస గోస కన్నా బాగుండేదేమో! దోస అనేది నిజానికి టిఫెన్ సెంటర్లలో దొరికే పదార్థం కాదు. ఎండాకాలం పండే ఒక పండు. తియ్యటి ఆ దోసకాయకు ఈ మధ్య కడప మెలన్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. కమ్మదనములూరుచుండు పెన్నేటి నీటిని దోసిటనొక్కమారు పుక్కిలించలేనివారు కూడా ఆ ఏటి నీళ్ళలో పండే దోసకాయల తీపిని అనుభవించవచ్చు.

-త్రివిక్రమ్, 99010 65406

(రచయిత  స్వస్థలం కడప సమీపంలోని పడిగెలపల్లె. ఎంసీఏ చేసి, సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిర పడ్డారు. ఇంటర్నెట్‌లో యూనికోడ్‌ తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషిచేసిన తొలితరం తెలుగు బ్లాగర్. 2006లో ప్రారంభమైన ‘పొద్దు’ తెలుగు వెబ్‌ మ్యాగజైన్‌ (poddu.net) వ్యవస్థాపక సంపాదకుడిగా నాలుగేండ్లు, 2016 – 2019 మధ్య ‘ఈమాట’ (eemaata.com) సహ సంపాదకుడిగా మూడేండ్లు వ్యవహరించారు. ఆన్లైన్లోనే నింపి పంపగల తెలుగు క్రాస్ వర్డ్ పజిల్స్ మొదలుపెట్టి పొద్దులోను, ఈమాటలోను అనేక క్రాస్ వర్డ్ పజిల్స్ కూర్చినారు.  వైవిధ్యమైన అంశాల గురించి kadapa.info, ఇతర వెబ్సైట్లలో రచనలు, అప్పుడప్పుడు కథలు రాస్తుంటారు)

RELATED ARTICLES

Most Popular

న్యూస్