Rayalaseema Industrial Hubs :
కొప్పర్తి మెగా పారిశ్రామిక హబ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే దాదాపు 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని సీకే దిన్నె మండలం కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ యూనిట్ ను సిఎం ప్రారంభించారు. వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్‌క్లేవ్ వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. 540 ఎకరాలలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ , మరో 3వేల 167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ హబ్ లో 1580 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోందని, ఇప్పటికే వందకోట్ల రూపాయలను ఖర్చుచేశామని సిఎం వివరించారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- ఈ హబ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ఆరు ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి
- ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ వచ్చింది, 1800 మందికి ఉపాధి కల్పిస్తోంది
- మొదటిది-ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్; రెండోది-డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి; మూడోది- సెల్‌కాన్ రెజుల్యూట్ సంస్థ; నాలుగోది- చంద్రహాస్ ఎంటర్ ప్రైజెస్; ఐదోది-యూటీఎన్పీఎల్ ఐదోది; ఆరోది -డిక్సన్ రెండో ప్లాంట్…ఈ ఆరు సంస్థలు దాదాపు 600కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి
- వీటితో దాదాపు 7వేల 500 ఉద్యోగాలు రాబోయే 9 నెలల్లో లభిస్తాయి.
- వీవీడీఎన్ సంస్థ కూడా ఇక్కడ 365 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈఒక్క సంస్థ ద్వారానే 5వేల 400 ఉద్యోగాలు వస్తాయి.
- ఈస్థాయిలో పెట్టుబడులు రావడంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.
- చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు రావాలి.
- దీనివల్ల మొత్తం రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుంది.
- ఓవైపున కొప్పర్తి , మరోవైపున నెల్లూరు–చిత్తూరు సరిహద్దుల్లోని శ్రీ సిటి… ఈ రెండూ రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ఉపయోగపడతాయి… అంటూ సిఎం జగన్ పేర్కొన్నారు.
Also Read : కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది: జగన్