Saturday, November 23, 2024
HomeTrending Newsనాడు ఆత్మహత్యలు, నేడు ఆర్బీకేలు: సిఎం

నాడు ఆత్మహత్యలు, నేడు ఆర్బీకేలు: సిఎం

ఒకప్పుడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను పరిశీలించేందుకు వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాల పథకం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాల క్రింద 2,190 కోట్ల రూపాయలను  క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేడు రైతుల అకౌంట్లలో జమ చేశారు.  రైతుల కళ్ళలో వారం రోజుల ముందే దీపావళి కాంతులు చూడాలని ఈ నిధులు నేడు విడుదల చేస్తున్నామన్నారు. వరుసగా మూడో ఏడాది రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూడా నాడు-నేడు కింద సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఆలోచన చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

రైతులు పంట పండించడానికి అవసరమైన అన్నింటినీ ఎక్కువ ధరకు రిటైల్ గా కొనుగోలు చేస్తారని, కానీ తాము  పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్ సేల్ గా అమ్మే పరిస్థితి ఉంటుందని నాటి అమెరికా అధ్యక్షుడు జాఫ్ ఎఫ్. కెన్నడీ  చెప్పిన మాటలను సిఎం జగన్ గుర్తు చేస్తూ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేకుండా ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలను రైతులకు ‘వన్ స్టాప్ సెంటర్’ గా తీర్చిదిద్దుతున్నామని, రైతులను చేయి పట్టుకొని నడిపించే గొప్ప వ్యవస్థగా తయారుచేశామని వెల్లడించారు. పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు, సున్నా వడ్డీ రుణాలు పారదర్శకంగా, సోషల్ ఆడిట్ ద్వారా, ప్రజలందరికీ అందుబాటులో వివరాలు ఉంచుతున్నామని, ఈ-క్రాపింగ్ ద్వారా ప్రతి పథకాన్ని అనుసంధానం చేసి ఓ గొప్ప మార్పు తీసుకు వచ్చామని వివరించారు. తమ 29 నెలల పాలనలో రైతాంగానికి అనుకూలంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్నారు. కరువులు, కాటకాలు మాత్రమే తెలిసిన ఒకప్పటి పరిస్థితి నుంచి  దేవుడి దయతో, వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా సాగునీరు అంది, పంట చేతికి వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సవాల్ విసిరిన సమయంలో కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తోన్న రైతు పక్షపాత ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. పొగాకు కొనుగోళ్లలో సైతం తాము జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు.

ఈ రెండున్నరేళ్ళ కాలంలో రైతు భరోసా కార్ర్యక్రమం కింద 18,777 కోట్ల రూపాయలు ఇవ్వగాలిగామన్నారు.  వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద నేడు జమ చేసిన 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు 1674 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, వీటిలో గత ప్రభుత్వం బాకీ పడిన రూ. 1180 కోట్లు కూడా తామే చెల్లించామని గుర్తు చేశారు. వైఎస్సార్  యంత్ర సేవా పథకం కింద 1720 గ్రూపులకు 25.55 కోట్ల రూపాయలు కూడా నేడు విడుదల చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిలాల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం జగన్ తో ముఖా ముఖి మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్