Saturday, January 18, 2025
HomeTrending Newsలెక్కలు కుదరకనే మంత్రివర్గ విస్తరణ వాయిదా

లెక్కలు కుదరకనే మంత్రివర్గ విస్తరణ వాయిదా

మంత్రివర్గ విస్తరణపై వరుస సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా వాయిదా వేసింది. ఆషాడ మాసం తర్వాత విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుని ఎంపికపై జూన్‌ చివరి వారంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీతో విస్తృతంగా చర్చించారు. ఐదు రోజులపాటు వీరంతా ఢిల్లీలోనే ఉండి సుదీర్గంగా మంతనాలు జరిపారు. విస్తరణ వాయిదా వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంత్రివర్గంలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. నిజామాబాదు నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నా వయోభారం దృష్ట్యా ఆయనను పరిగణనలోకి తీసుకోవటం లేదని తెలిసింది. జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పేరు ప్రత్యామ్నాయంగా తెర మీదకు వచ్చింది. అధిష్టానానికి సన్నిహితుడిగా పేరుంది.

మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇస్తే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు నిరాశ ఎదురు కాక తప్పదు. ఇద్దరు వెలమ సామాజిక వర్గం కావటంతో ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చి తీరవలసిందే అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు కాకుండా రేవంత్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి పేరు ప్రతిపాదించడంపై అభ్యంతరాలు వ్యక్తమైనట్టు చెప్తున్నారు.

జీ వెంకటస్వామి కుమారులు వివేక్‌, వినోద్‌కు ఎమ్మెల్యేలుగా, ఆయన మనవడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పించి వారి కుటుంబానికి మంత్రి పదవి కూడా ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించడాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. తాను భట్టి వర్గీయుడననే కారణంగానే మంత్రి పదవి ఇవ్వకుండా సీఎం అడ్డుపడుతున్నట్టు ప్రేమ్‌సాగర్‌రావు తన సన్నిహితుల వద్ద వాపోయారట.

మరోవైపు బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటపుడే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి హామీ దక్కింది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిఎం, అధిష్టానం ఒప్పుకున్నాయి. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పేచి పెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు నిలబడ్డామని కుటుంబంలో ఇద్దరికీ ఇస్తే ఏమవుతుందని ఉత్తమ్ వాదిస్తున్నారు.

నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అయినప్పటికీ ఇదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును ప్రతిపాదించడాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకించినట్టు తెలిసింది.

కంటోన్మెంట్‌ నుంచి శ్రీగణేశ్‌ గెలుపొందినప్పటికీ ఆయనకు కాకుండా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన దానం నాగేందర్‌ పేరును సీఎం ప్రతిపాదించడాన్ని కూడా సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. యాదవ సామాజిక వర్గం నేతకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. దీంతో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఆషాడం తర్వాత తలసాని పార్టీ మారుతారని గాంధీభవన్ వర్గాలు ధీమాగా చెపుతున్నాయి.

మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని సీనియర్లు అధిష్ఠానం వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్ష, ఒంటెద్దు పొకడలకు చెక్‌ పెట్టే ఉద్దేశంతోనే అదిష్ఠానం దీనిని వాయిదా వేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్