Urban Forest Parks : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది. ఆ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ బ్లాగ్ కాంపిటీషన్ లో అదనపు అటవీ సంరక్షణ అధికారి ఎం.సీ. పర్గెయిన్ రాసిన కాలమ్ మూడో స్థానం దక్కించుకుంది. ప్రపంచ ట్రీ సిటీగా ఇటీవలే గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ పర్యావరణ పరంగా పునరుజ్జీవనం పొందటం, అందుకు దోహద పడుతున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులపై రిసిలియెన్స్ అండ్ బెటర్ లైఫ్ విత్ అర్బన్ ఫారెస్ట్స్ ఇన్ హైదరాబాద్ (Resilience and better life with urban forests in Hyderabad) పేరుతో పర్గెయిన్ బ్లాగ్ రాశారు.
ఈ కాలమ్ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది.
మే 2 నుంచి 6 దాకా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగే వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ లో అర్బన్ ఫారెస్ట్ పార్కులపై కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది గురించి, అటవీ పునరుద్దరణ పనుల వివరాలు తెలుసుకున్న అంతర్జాతీయ జ్యూరీ ప్రశంసించింది. చాలా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వాన్ని, అటవీ శాఖను ప్రశంసించింది. అటవీ బ్లాక్ లను వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకుని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్న విధానాన్ని కూడా జ్యూరీ మెచ్చుకుంది.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో 59 పార్కులు రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. అడవుల పునరుద్ధణ, సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత దక్కడానికి కృషి చేసిన అడిషనల్ పీసీసీఎఫ్ ఎం.సీ. పర్గెయిన్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సమిష్టి కృషితో అనుకున్న ఫలితాలను సాధించగలుగుతున్నామని, మరింత ఉత్సహాంగా పని చేసేందుకు ఇలాంటి ప్రశంసలు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని మంత్రి పేర్కోన్నారు.
Also Read : హరితహారం గొప్ప కార్యక్రమం : కేటీఆర్