Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాత్రిళ్లు కూడా ఇక సౌర విద్యుదుత్పత్తి

రాత్రిళ్లు కూడా ఇక సౌర విద్యుదుత్పత్తి

సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చే కిరణాలు కొన్ని. వెలుగులు పంచే కిరణాలు కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. ఎరుపు రంగు కిరణాలు కొన్ని. పసుపు రంగు కిరణాలు కొన్ని. బంగారు రంగు కిరణాలు కొన్ని. నీలపు రంగు కిరణాలు కొన్ని. అతి నీలలోహిత కిరణాలు కొన్ని.

“ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్”

గాయత్రీ మంత్ర రహస్యమే సూర్యుడి కిరణం. సూర్యుడి కిరణమే గాయత్రీ దేవి నివాసం. అంటే వెలుగే దైవం. వెలుగే చైతన్యం. వెలుగే జ్ఞానం. వెలుగే శక్తి. వెలుగే సర్వస్వం.

సూర్యుడు లేకపోతే అంతా చీకటి. చిమ్మ చీకటి.

శ్లోకం:-
ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛే ద్ధుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛే జ్జనార్దనః.

పద్యం:-
సూర్యు డారోగ్యమిచ్చును సుజనులార!
సంపదలనగ్ని యొసగును సరసులార!
జ్ఞాన మీశ్వరుడిచ్చును జ్ఞానులార!
మోక్షమిచ్చు జనార్దనుండక్షయముగ-
అని మన రుషుల వాక్కు.

విష్ణువు రెండు కళ్లు సూర్య- చంద్రులు అంటుంది విష్ణు సహస్రనామం.

సూర్యుడు లేకపోతే అంతా శూన్యం. పంట లేదు. వంట లేదు. బతుకే లేదు. కానీ అదే సూర్యుడు కొంచెం వేడిని పెంచితే తట్టుకోలేము. యూరోప్, అమెరికా, రష్యా లాంటి అతి శీతల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటితే మహా ప్రళయం వచ్చినట్లే. తట్టుకోలేరు. మనదగ్గర 40-45 డిగ్రీల వేడితో సలసల కాగుతున్నా వేడి వేడి టీ కాఫీలు కోరి కోరి తాగుతాం. వేడి వేడి మిర్చీ బజ్జీలు తింటాం. మండే ఎండల్లో బీడీలు, సిగరెట్లు తాగి పొగను సూర్యుడి మీదికే వదులుతూ ఉంటాం.

సూర్యుడి కిరణాలనుండి విద్యుదుత్పత్తి- సోలార్ పవర్ తెలిసిందే. సూర్యుడు లేనివేళ, ప్రత్యేకించి రాత్రిళ్లు సోలార్ పవర్ కు అవకాశమే ఉండదు. దాంతో అత్యంత పర్యావరణ అనుకూలమైనా సోలార్ పవర్ మీద ఆధారపడడంలో అనేక ఇబ్బందులున్నాయి.

రాత్రిళ్లు సూర్యకాంతిని పట్టుకోవడంమీద అమెరికా కాలిఫోర్నియాలో రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అనేక పరిశోధనలు చేసి…వినూత్న సాంకేతిక విధానాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

వీరు చెబుతున్న ప్రకారం భూమి మీదనుండి దాదాపు 370 మైళ్ల ఎత్తులో ఉండే విధంగా 33 ఉపగ్రహాలను పంపుతారు. వాటి చుట్టూ సూర్యకాంతిని ఆకర్షించే అద్దాలు బిగించి ఉంటాయి. భూమి మీద సూర్యుడు అస్తమించినా…ఈ ఉపగ్రహాల అద్దాలమీద పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది…కింద నేల మీద అమర్చిన సౌరఫలకాలమీద పడేలా ఏర్పాటు చేస్తారు. రాత్రిళ్లు వీరిదగ్గరి నుండి సూర్యకాంతిని సౌరవిద్యుదుత్పత్తిదారులు కొనుక్కోవచ్చు. ఒక రాత్రిపూట హాట్ ఎయిర్ బెలూన్లో పైకి వెళ్లి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు.

ఇక కాలిఫోర్నియా వీధుల్లో-
“రండి బాబూ రండి!
వేడి వేడి సూర్యకాంతి బాబూ!
రెండు కిలో వాట్లు!
ఎముకలు కొరికే రాత్రి చలిలో వేడి వెలుగుల సూర్యకాంతి తల్లీ!
నాలుగు కిలో వాట్లు పొట్లం కట్టిస్తాం! తీసుకెళ్లి ఇంట్లో సౌరవిద్యుత్తుకు వాడుకోండి!”
అన్న నైట్ సోలార్ సేల్స్ మ్యాన్ పిలుపులు వినవచ్చు!

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ…సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుండడంవల్ల రాత్రీపగలు ఏర్పడుతున్నాయి. తన మీద తిరిగే ప్రాణులకు విశ్రాంతి ఇవ్వాలని భూమి కనీసం రాత్రి అయినా సూర్యుడి కంటికి దూరంగా ఉంటోంది. ప్రకృతి నియమాలన్నిటినీ తుంగలో తొక్కే మనిషి ఇప్పుడు రాత్రి కూడా ధాత్రిని నిద్రపోనిచ్చేలా లేడు. రాత్రి కూడా సూర్యుడిముందు భూమిని నిలుచోబెడితే ఇక-
ఏది పగలు?
ఏది రాత్రి?
ఓ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ మహాత్మా!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్