Tuesday, September 17, 2024
HomeTrending Newsఅబద్ధాలే పునాదులుగా బాబు పాలన: సిఎం జగన్

అబద్ధాలే పునాదులుగా బాబు పాలన: సిఎం జగన్

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మాటలు మార్చడంలో బాబు ఊసరవెల్లిని మించి పోయారని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అవ్వాతాతలకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదంటూ తన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి ఆపించిన బాబు… ప్రజల్లో వస్తోన్న ఆగ్రహాన్ని గ్రహించి తాను అధికారంలోకి రాగానే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని చెబుతున్నారని దుయ్యబట్టారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళలో జరిగిన పల్నాడు జిల్లా మేమంతా సిద్ధం బహిరంగసభలో జగన్ ప్రసంగించారు.

వాలంటీర్లను తీసివేసి వారి స్థానంలో తన కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు నియమించి వారికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలన్నది బాబు పన్నాగమని జగన్ అన్నారు. ఇది మోసపూరిత రాజకీయం అనే విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసన్నారు. బాబు బతుకంతా అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా… వెన్నుపోట్లు చరిత్రగా సాగుతుందని, సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది బాబును గుర్తుకు తెచ్చేదిగా ఉంటుందన్నారు.

బాబు హయంలో వచ్చిన జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని… రేషన్ ఇవ్వాలన్నా, పెన్షన్ కోసం, ఆఖరికి మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకున్నారని, రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కానీ తమ హయంలో ఏర్పడిన వాలంటీర్ల వ్యవస్థ  ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పని చేసిందని… బటన్ నొక్కడం ద్వారా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేశామని వివరించారు. ఇది జన్మభూమి కమిటీలకు – వాలంటీర్లకు మధ్య  విషయం కాదని.. ముఖ్యమంత్రిగా ఎవరున్నారన్నదే విషయమని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపించే విధంగా విత్తనం నుంచి పంట విక్రయం వరకూ తోడుగా ఉంటున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు.

పేదవాడి భవిష్యత్తు, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటి వైపు తీసుకు వెళ్లేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు…పొత్తులతో జిత్తులమారి పార్టీలు చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రజలను అడిగారు జగన్. రాబోయే ఎన్నికల్లో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారతాయని, అలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్