ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అమీర్ పేటలోని శ్యామకరణ్ రోడ్డులో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఈ మధ్యాహ్నం మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం కూడా ధృవీకరించారు.
గద్దర్ వయసు 76 సంవత్సరాలు, ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1949 జూన్ 5న మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని హన్మాజీపేటలో ఆయన జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1975లో కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా చేరిన ఆయన వామపక్ష ఉద్యమాలకు వైపు ఆకర్షితులై 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా గళం విప్పారు. జన నాట్య మండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు.
తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ కీలకపాత్ర పోషించారు. మా భూమి సినిమాలో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కన్పించిన గద్దర్ ఉద్యమ సమయంలో దర్శకుడు శంకర్ రూపొందించిన ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా’ పాటలో నటించారు. ‘బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ఏ బండిలో నువ్వోస్తవ్ నైజాం సర్కరోడా’ అంటూ నిజాం పాలనపై ఆయన గజ్జె కట్టి ఆడిన పాట తెలుగు విప్లవాభిమానులను ఉత్తేజపరిచింది.
జూలై ఇరవై న ఆస్పత్రిలో చేరిన గద్దర్ నాలుగు రోజుల క్రితం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు తన ఆరోగ్యం కుదుటపడుతోందని త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ వెల్లడించారు. నాలుగు రోజుల్లోపే ఆయన మరణించడం ఆయన అభిమానులను నివ్వెర పరిచింది. గత నెల 28న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆస్పత్రిలో గద్దర్ ను పరామర్శించారు.