Thursday, April 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅనంత్ శ్రీరామ్ ఉవాచ

అనంత్ శ్రీరామ్ ఉవాచ

Ready to Review?:
సినిమా పాటల రచయిత అనంత్ శ్రీరామ్ గారికి-

అయ్యా,
తెలుగు సినిమా పాటల్లో సిధ్ శ్రీరామ్ ఉల్టే కల్టే కుల్దాం అని పాడడాన్ని నేను తప్పు అన్నాను. ఆ వీడియో ఇది.

ఇలా పాడడం తప్పు కాదు అని మీరంటున్నారు. కనీసం రాసిన రచయిత అయినా చెప్పాలి కదా అని నేను సూచించాను. మీరు అవసరమే లేదని…సంగీతంలో తీవ్రశ్రుతిలో పాడేప్పుడు ఎవరయినా అలాగే పాడతారని…ఆ సాంకేతిక అంశాలు తెలియకుండా మాట్లాడకూడదని మీరన్నారు.

(కాపీ రైట్ సమస్య వల్ల ఆ వీడియోను ఇక్కడ చూపడం కుదరదు. ఆసక్తి ఉన్నవారు ఆ ఛానల్ లో చూడవచ్చు)

నాకు అర్థమయినంతవరకు ఐ డ్రీమ్స్ యూ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో యాంకర్, రచయిత సిరాశ్రీ  నా పేరు ప్రస్తావించి…సిధ్ శ్రీరామ్ తెలుగు పాడడంలో లోపాల మీద నేను చేసిన వీడియో గురించి మిమ్మల్ను అడిగితే…మీరు నాకు ఇచ్చిన ఉచిత సలహాలివి

1. పై స్థాయి/తీవ్ర శ్రుతి/తార స్థాయిలో పాడేప్పుడు ఈ దోషాలు సహజం.
2. గతంలో కొన్ని పాటల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. అవి దోషం కాదు.
3. సంగీతం పాడడంలో  సాంకేతిక అంశాలు తెలియకుండా…ఇలా సినిమా రచయితలు, గాయకులను విమర్శించకూడదు.
4. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తెలుగు నేర్పాలి.
5. లేదా గొప్ప కార్పొరేట్ బళ్లలో తెలుగు బోధించాలి.

నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడాను. మీరు కూడా పూర్తి స్పృహలో ఉండి ఏమి మాట్లాడుతున్నారో తెలియాలంటే... ఈ విషయం మీద మీ జ్ఞానం- నా అజ్ఞానం వాదించుకోవడం దండగ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న సంగీత, భాషాశాస్త్రవేత్తలను ఇద్దరినో, ముగ్గురినో ఎంపిక చేసి…వారి ముందు మన వాదనలు వినిపిద్దాం. సిధ్ శ్రీరామ్ అలా పాడడం తప్పు కాదని భాషాశాస్త్రవేత్తలు అంగీకరించినా…సాంకేతికంగా సంగీతం పాడేప్పుడు ఉంటే ఉల్టే; కుంటే కుల్టే; కుందాం కుల్దాం అవుతుందని సంగీతవేత్తలు అంగీకరించినా…నేను మీకు క్షమాపణ చెప్పి…నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాను. మీ వాదన తప్పని తేలితే మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన పని కూడా లేదు. ఇంకోసారి సిధ్ శ్రీరామ్ కు పి ఆర్ ఓ గా వకాల్తా పుచ్చుకుని మీరు ఇలా తలా తోక లేకుండా మాట్లాడకుంటే చాలు.

ఇదే ఇంటర్వ్యూలో మీరు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గురించి సామవేదం, చాగంటి, గరికపాటికంటే లోతుగా ఏవేవో వివరణలు ఇచ్చారు. హిందూమతం మతం కాదని…మీరన్నట్లు అది కేవలం ఒకానొక “అభిమతమే” అయితే ఇంకా గట్టిగా బయటికొచ్చి చెప్పండి. దానిమీద కూడా మీ అవగాహన తప్పని నిరూపించడానికి రోజూ మీరు వద్దన్నా జనం మీ ఇంటిముందు వచ్చి కూర్చుంటారు. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం.

ఇప్పుడు మీకు సూటిగా నా ప్రశ్నలు:-

1. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును పెట్టించే బాధ్యత నాదా? లేక అలా తెలుగును పెట్టించినప్పుడే నాకు మిమ్మల్ను అడిగే అధికారం వస్తుందా?
2. నారాయణ, చైతన్య లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ బళ్లలో తెలుగును పెట్టించాల్సిన బాధ్యత కూడా నాదేనా?
3. పై స్థాయిలో అయినా, పాతాళంలో అయినా, ఎవరు ఎప్పుడు పాడినా…తప్పు తప్పే గానీ…తప్పు ఒప్పవుతుందా?

4. శ్రుతి స్థాయిని బట్టి దోషాలను గుణాలుగా స్వీకరించడం ఏ ప్రామాణిక సంగీత గాన కళాబోధినిలో సాంకేతిక పాఠంగా ఉంది?
5. నేను అన్నది సిధ్ శ్రీరామ్ ను. మీరెందుకు ఇంతగా భుజాలు తడుముకుని…ఉలిక్కిపడి…నా మీద వెటకారం దట్టించి…నావి కాని పనులు నేను చేయాలని పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
6. మా అబ్బాయి లండన్లో భౌతికశాస్త్రం చదువుతూ…తెలుగు సాహిత్యం, సినిమా పాటల్లో తెలుగు గురించి మాట్లాడుతున్నాడు. మీ సూత్రీకరణ ప్రకారం తెలుగు మీడియంలో చదవని వారికి తెలుగు గురించి మాట్లాడే అర్హత ఉండదేమో కదా?

అంత సర్కాస్టిక్ గా, శ్లేషను దట్టించి మీరన్నట్లుగానే…నిజంగానే…
నేను తెలుగు, సంస్కృతం, జర్నలిజం, సైకాలజీ చదువులను ప్రభుత్వ బడులు, కాలేజీలు, యూనివర్సిటీల్లోనే చదివాను. మీ అంత అనంతంగా కాకపోయినా…తెలుగు భాషోత్పత్తి, భాషా శాస్త్రాలను, సంప్రదాయ సంగీత రీతులను ముప్పయ్ అయిదేళ్లుగా అకెడెమిక్ ఇంట్రెస్ట్ తో ఆవగింజంత అయినా చదువుతూనే ఉన్నాను. మీ ‘సాంకేతిక’ సంగీత సాహిత్య జ్ఞానంతో ఆ యాంకర్ కన్వెన్స్ అయినట్లు నేను కాలేకపోతున్నాను.

లోకంలో ఎవరూ సర్వజ్ఞులు కాదు. జీవితమంతా నేర్చుకుంటూనే ఉండాలి. తెలుగు భాషాభిమానిగా నేనొక విషయాన్ని లేవనెత్తితే…దానికి మీరు అతకని సమాధానంతో లేని శాస్త్ర ప్రమాణాన్ని సృష్టించి…దానికి “సాంకేతిక అంశం” అని పేరు పెట్టారని అనుకుంటున్నాను.

“చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొట్టి కుళ్లబొడిచి…అధోగతి పాలు చేయడానికి”
ఇది మీ గేయంలో భావం కాదు.

ఉల్టే ఉల్డి పోనీలే అనుకోవడానికి ఇది మీ ఆరాధ్య గాయకుడు సిధ్ శ్రీరామ్ ఒక్కడికే సంబంధించిన “కురులావి”, “కళ్లావి” పలుకులు కావు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేను కోట్లమంది తెలుగువారి అస్తిత్వ ఆస్తిగా ఉన్న భాషకు సంబంధించిన విషయం. పదిహేను వందల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న ఒక అమృతతుల్యమయిన భాష భవిష్యత్తుకు సంబంధించిన విషయం.

మీ మీద పడేంత తీరిక, ఓపిక నాకు లేవు. మీ అంత సాంకేతిక జ్ఞానం నాకు లేదన్న ఆత్మజ్ఞానం కూడా నాకు ఉందని అనుకుంటున్నాను.
ఈ విషయంలో మనిద్దరిలో ఎవరి వాదన తప్పో, ఎవరి వాదన ఒప్పో తేల్చడానికి సంగీత, భాషాశాస్త్ర పండితుల ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.

లేకపోతే…
“విస్సన్న చెప్పిందే వేదం” అవుతుంది.
అది లోకానికి అస్సలు మంచిది కాదు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సిధ్ శ్రీరామ్ సమర్పిత ఇనుప గుగ్గిళ్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్