Sunday, January 19, 2025
HomeTrending NewsExit Polls: హస్తం వైపే మొగ్గు...కారు నేతల్లో ధీమా

Exit Polls: హస్తం వైపే మొగ్గు…కారు నేతల్లో ధీమా

తెలంగాణలో పోలింగ్ ముగియటంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్ని సర్వే సంస్థలు చెపుతున్నా…ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని కొందరు, దరిదాపుల్లోకి వస్తుందని మరికొన్ని చెపుతున్నాయి.

ఎన్నికల ప్రచారం సమన్వయంతో నిర్వహించిన కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ లో కొంత వెనుకపడిందని పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉన్న చోట కూడా కొంత నిర్లక్షం చోటు చేసుకుందని అంటున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనపరుస్తోందని సమాచారం.

పోలింగ్ వారం రోజుల ముందు బిజెపి అగ్రనేతలు చేపట్టిన సుడిగాలి ప్రచారం కాంగ్రెస్ విజయావకాశాలను చాల చోట్ల దెబ్బకొట్టింది. రికార్డు స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు నుంచి నాలుగు స్థానాలు బిజెపి గెలవబోతోందని అంచనా. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని మార్చక ముందు నుంచి బిజెపి ఇదే శ్రద్ధ తీసుకుంటే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు చేసి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ నుంచి చాలా చోట్ల మూడుసార్లు ఒకే అభ్యర్థి రావటం…వారిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నా నాయకత్వం పట్టించుకోపోవటం…క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు మనస్పూర్తిగా పార్టీ విజయానికి పనిచేయలేకపోయారని తెలిసింది. నామినేషన్ నుంచి పోలింగ్ నాటికి గులాబీ కొంత పుంజుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు చేరువలో లేదని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి.

కొన్ని సర్వే సంస్థలు సంచలన అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నాయి. కామారెడ్డిలో కెసిఆర్, రేవంత్ రెడ్డిలకు ఓటమి తప్పదని…బిజెపి విజయం సాధిస్తుందని వెల్లడించాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోతున్నారని అనూహ్యంగా నిర్మల్ లో బిజెపి విజయం సాధిస్తోందని అంచనా. ఇలాంటి సంచలనాలు డిసెంబర్ మూడున చూడబోతున్నామని సర్వే సంస్థలు ప్రకటించాయి.

చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో భాగంగా బీఆర్‌ఎస్‌ 21-31 సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొంది. ఇదే సర్వే కాంగ్రెస్‌కు 67-78 సీట్లు, బీజేపీకి 6-9 సీట్లు, ఎంఐఎం  6-7 సీట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది.

సర్వే సంస్థ .. పీపుల్స్‌ పల్స్‌- సౌత్‌ఫస్ట్‌
బీఆర్ఎస్ – 35-46, కాంగ్రెస్+ – 62-72, బీజేపీ+ – 3-8, ఎంఐఎం – 6-7, ఇతరులు 1-2

పీపుల్స్‌ పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఓటింగ్ షేర్ వివరాలు
బీఆర్‌ఎస్‌ – 37.8 శాతం, కాంగ్రెస్‌ పార్టీ – 42.7 శాతం, బీజేపీ – 13.2 శాతం, ఎంఐఎం – 2.5 శాతం ఓట్లు సాధించే అవకాశం

CNN ఎగ్జిట్ పోల్స్ – 2023

CNN ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్-56 సీట్లు దక్కనున్నాయి. ఇక బీఆర్ఎస్-48, బీజేపీ-10,ఎంఐఎం-5 సీట్లు వస్తాయని వెల్లడించింది.

ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుపై గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. గతంలో నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ విధంగానే సర్వే ఫలితాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. తీరా ఎన్నికల ఫలితాల్లో మోడికి స్పష్టమైన మెజారిటీ వచ్చిందని వివరిస్తున్నారు. సిఎం కెసిఆర్, తెలంగాణవాదాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలు ఏకమై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని…ముచ్చటగా మూడోసారి గెలిచి..కెసిఆర్ హట్రిక్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని భరోసా వ్యక్తం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్