Friday, June 12, 2026

గీతాసారం

ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి.

18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. ఈ మాటలను అటు ఇటు జరిపి “క్షేత్రే క్షేత్రే ధర్మం కురు” “ప్రతి చోటా ధర్మాన్నే పాటించు” అన్న అర్థం తీసుకోవాలని పురాణ ప్రవచనకారుల భాష్యం.

అటు ఇటు కురు పాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ…కదనసీమ కురుక్షేత్రం మధ్యలో విల్లమ్ములు పారేసి వైరాగ్యంతో నీరుగారి…యుద్ధం చేయను…అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినది ఈ భగవద్గీత.

మనమేమీ సంసార యుద్ధసీమలో అర్జునుడిలా భయపడి విల్లమ్ములు పారేసి…పలాయనం చిత్తగించలేదే? మరి మనకెందుకు ఈ గీత?

ఎందుకంటే?
కృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికే చెప్పాడు కనుక. ఒక్క అర్జునుడికి మాత్రమే ఇలాంటి వ్యామోహాలు, వైరాగ్యాలు, నిట్టూర్పులు, నిస్సత్తువ, పలాయనవాదాలు లేవు…లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారని కృష్ణుడికి తెలుసు కనుక. ఆ రోజుల్లో వాట్సాప్ లు, ఫేస్ బుక్ లైవ్ లు, శాటిలైట్ లైవ్ లు లేవు కాబట్టి కోట్ల మంది పోగయిన ఒకేచోట అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు. అర్జునుడు ఒక్కడికే అయితే గుడారంలోకి పిలిచి చెవిలో చెప్పేవాడు. మనకు వినపడి ఉండేది కాదు.

ఘంటసాల ఏ క్షణాన భగవద్గీతలో కొన్ని శ్లోకాలను పాడాడో కానీ…అప్పటినుండి భగవద్గీత శవయాత్రలకు శబ్దసహకారంగా మారిపోయింది. ఆత్మలకు సంబంధించిన తాత్విక విషయాలు కొన్ని గీతలో ఉండడం, ఘంటసాల వాటిని అనితర సాధ్యంగా పాడడం, చావు పందిట్లో సౌండ్ బాక్సులో ఏమి పెట్టాలో తెలియకపోవడంతో భగవద్గీత చావు పందిరి మేళం అయిన మాట నిజం. ఇలా చచ్చినవారి వెంట నేపథ్య గానం అవుతుందని తెలిసి ఉంటే ఘంటసాల ఎట్టి పరిస్థితుల్లో భగవద్గీత పాడి ఉండేవారు కాదు.

బతికి ఉండగా ఏనాడూ గీతలో ఒక్క మాట వినలేదు…కనీసం చచ్చాక అయినా భగవంతుడి వాక్కు వెంట వస్తోంది…పుణ్యమే కదా? వద్దంటే ఎలా? అన్నది ఒక వాదన.

మన మెదళ్లలో బూజు దులిపి, మన మనసుల్లో అలముకున్న నైరాశ్యాన్ని పారద్రోలి, వంగిన మన వెన్నెముకలను నిటారుగా నిలబెట్టి, మన జీవన కార్య క్షేత్రంలో యుద్ధానికి కావాల్సిన భౌతిక, బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను బతికి ఉండగా వాడుకుని బతుకును బాగు చేసుకోకుండా…చచ్చాక వినిపిస్తే ఎవరిని ఉద్ధరించడానికి? అన్నది మరొక వాదన.

ఈ చర్చలజోలికి వెళ్ళకుండా అందులో ఉన్న మంచిని పదిమందికీ పంచుతుంటారు కొందరు. బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన కేతావత్ సోమ్ లాల్ భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించారు. నిజానికి భగవద్గీతా ప్రచార కార్యక్రమాలకోసమే ఇంకా చాలా ఏళ్ళ సర్వీసు ఉండగానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బంజారా భాషలోకి అనువదించిన భగవద్గీతకు, దానిమీద ఆయన ఉపన్యాసాలకు సామాజిక మాధ్యమాల్లో విశేషమైన స్పందన వస్తోంది. అటు బంజారా భాషలో, ఇటు సాధారణ తెలుగులో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కేతావత్ సోమ్ లాల్ తపన, గీతానువాదం, ఆధ్యాత్మిక ప్రచారం మరికొందరికి దారిదీపం కాగలదు. కావాలి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular