ఇప్పటిదాకా రకరకాల కలయికల గురించి విన్నాం. పాత విద్యార్థులతో మొదలైన సమ్మేళనాలు, వనభోజనాల్లో ఒకే కులం వారి మీటింగులు మనకి తెలిసినవే. ఆ మధ్య కవలలు ఒక సమావేశం పెట్టుకుంటే ఓహో అనిపించింది. సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల సాహిత్య గ్రూపులు, వంటల గ్రూపులు కూడా సమావేశం పెట్టుకోవడం విశేషం. అయితే ఒక పేరుగలవాళ్ళు కుల, ప్రాంత రహితంగా సమావేశం కావడం అరుదు. ఇందుకు కరీంనగర్ వేదిక అయింది. అదీ
ఒకరు ఇద్దరు కాదు… వందల మంది!

‘శ్రీనివాస్’ అనే పేరున్న వారంతా ఒకే వేదికపై కలవడం అంటే వింతగానే ఉంది. రెండేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి ‘మనమంతా శ్రీనివాసులమే’ అనే పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను ప్రారంభించారు. ఆ గ్రూప్‌లో భిన్న వృత్తుల్లో ఉన్న శ్రీనివాసులు పరిచయం అవుతూక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా వేలమందిగా మారారు. మొదటి ఏడాదిలోనే 6,580 మంది సభ్యులు చేరగా,ప్రస్తుతం 28 వాట్సాప్ గ్రూప్‌లలో కలిపి 22,600 మంది శ్రీనివాసులు ఉన్నారు. ఈ సమూహం ‘తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ’గా ఏర్పడి, సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, ఆరోగ్య శిబిరాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ సంస్థ గుర్తింపు సాధించింది. 2024 అక్టోబర్ 27న మొదటి వార్షికోత్సవానికి 760 మంది హాజరయ్యారు. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 26న రెండో వార్షికోత్సవానికి వేలాది శ్రీనివాసులు కరీంనగర్‌లో గుమికూడారు. దీనికి ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలనుంచి హాజరయ్యారు.
వీరి లక్ష్యం కేవలం కలవడమే కాదు — కలసికట్టుగా ఉంటూ ఐక్యత, సేవ, విద్య, ఆరోగ్య పరిరక్షణ, ఆధ్యాత్మిక భావన అనే ఐదు సూత్రాలతో ముందుకు సాగడం.తాజా సమావేశానికి అందరూ శ్రీనివాసుని నామం ధరించి రావడం , ముందు రక్తదానం చేయడం విశేషం. అన్ని రకాల వృత్తి ఉద్యోగాలకు చెందినవారు ఈ గ్రూపులో ఉన్నారు.
భవిష్యత్తులో దేశ విదేశాల్లోని అన్ని శ్రీనివాసులు ఒకే వేదికపై గుమికూడి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవాలని సంకల్పించారు. బాగుంది. ఇకనుంచీ పేరులో నేముందీ? అనకూడదు. పేరులో చాలా ఉంది అనుకోవాలి. ముందు ముందు ఇంకెన్ని పేర్ల సంఘాలు ఏమేం సాధిస్తాయో చూడాలి.
-కె. శోభ

