Koamatireddy : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోవర్టుగా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మోడికి మేలు చేసేందుకే జాతీయ కూటమి అంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టారని, కాంగ్రెస్ను బలహీన పరచటం, కాంగ్రెస్ మిత్ర పక్షాల్లో చీలిక తీసుకురావటమే లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఐక్యంగా గళం వినిపించారు. మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీ అభ్యున్నతిలో కీలకమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తర్వాత… తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి అని గుర్తు చేశారు. కేసీఆర్.. పదవులకు రాజీనామా చేసి మళ్లీ తెచ్చుకున్నాడని ఫైర్ అయ్యారు. మోడీకి, ఎన్డీయేకి అనుకూలంగా పని చేసేందుకు కేసీఆర్ సుఫారీ తీసుకున్నారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నాలుగు కోట్ల మంది బాగుండాలని సోనియాగాంధి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని.. నాలుగు కుటుంబాలు బాగుండాలి అని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించారు. కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య గ్యాప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ గతేడాది నవంబర్‌లో చేపట్టిన వరి దీక్ష వేదికగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే వేదిక పంచుకున్నారు. స్టేజ్ పై ఇద్దరు ఒకే దగ్గర కూర్చుకున్నారు. ఒకరిని ఒకరు నవ్వూకుంటూ పలకరించుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్లతో తనుకున్న గ్యాప్‌ను తొలగించే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు.. పక్కపక్కన నిలబడి ప్రెస్‌మీట్ పెట్టారు. దీంతో ఇరువురు నేతల మధ్య గ్యాప్ కొంత తగ్గిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read : మోడీ తెలంగాణ ద్రోహి – రేవంత్ రెడ్డి