కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారన్నారు. కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి బీజేపీని బండకేసి కొట్టారని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తో జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ నెలాఖరులో పొంగులేటి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత గాంధి భవన్ లో బెల్లంపల్లికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్ ఎస్ కు పెద్ద తేడా ఏం లేదన్నారు.
రేవంత్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు
అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్, ఇక్కడ బీఆరెస్ ది 30 శాతం కమీషన్ సర్కార్. బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గనిపిస్తుంది. పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్ కు ఏమనిపించడంలేదా? దేశమంతా ఎమ్మెల్యే చరిత్ర తెలిసినా కేసీఆర్ కు తెలియడంలేదా? అక్కడ ఉన్నది దుర్బుద్ధి చిన్నయ్యా? దుర్గం చిన్నయ్యా? దండుపాళ్యం ముఠా శాండ్, ల్యాండ్, మైన్ అవినీతిలో ఎక్కడ చూసినా బీఆరెస్ నేతలే. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది.
టీఎస్పీఎఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా ఉంది. టీఎస్పీఎఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను పునఃసమీక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లు చేతులు మారాయి. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలి. పేపర్ లేకేజీకి కారణం మంత్రి కేటీఆర్ అని కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎఎస్సీ చైర్మన్, సభ్యులను తక్షణమే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.