Sunday, January 19, 2025
HomeTrending Newsయాదాద్రి పనుల పురోగ‌తిపై సమీక్ష

యాదాద్రి పనుల పురోగ‌తిపై సమీక్ష

యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో ఆల‌య ప‌నుల పురోగ‌తి, మ‌హా సుద‌ర్శ‌న యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్ల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. అర‌ణ్య భ‌వ‌న్ లో నిర్వ‌హించిన‌ ఈ సమావేశానికి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ఆర్ & బీ ఈఎన్సీ గ‌ణ‌ప‌తి రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఈవో గీతారెడ్డి, అర్కిటెక్ట్ ఆనంద్ సాయి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు , క‌ళ్యాణ క‌ట్ట‌, దీక్షాప‌రులు మండ‌పం, అన్న ప్రసాదం, వ్ర‌త మండ‌పం, గండి చెరువు సుంద‌రీక‌ర‌ణ, బస్ ట‌ర్మిన‌ల్స్, త‌దిర‌త‌ల‌ నిర్మాణాల పురోగతిపై మంత్రి చర్చించారు. మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మ‌హా సుద‌ర్శ‌న యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్య‌క్ర‌మాల ఏర్పాట్లు, యాగ‌శాలల నిర్మాణం, రుత్వికుల‌కు బ‌స చేసేందుకు విడిది, త‌దిత‌ర ఏర్పాట్ల‌పై మంత్రి ఆరా తీశారు. గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నుల తీరుపై క్షేత్రస్థాయిలో స‌మీక్ష నిర్వ‌హించుకుంటూ.. స‌కాలంలో ప‌నులన్ని పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తజన సందోహం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతుంద‌ని, దాదాపుగా అన్ని ప‌నులు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయ‌ని, ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని ప‌నులను ఫిబ్ర‌వ‌రి లోపు పూర్త‌యేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు .  సీయం కేసీఆర్ పిలుపు మేర‌కు విమాన గోపుర బంగారు తాప‌డానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వ‌స్తున్నార‌న్నారు.

ఎన్ఆర్ఐ ల నుంచి విరాళాల సేక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక యాప్

ఆవిష్క‌రించిన‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఎన్ఆర్ఐ దాత‌ల నుంచి సేక‌రించిన నిధుల‌తో ఆల‌యాల్లో భ‌క్తుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ రూపోందించిన ప్ర‌త్యేక మొబైల్ యాప్ ను గురువారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. ధైవ భ‌క్తితో సేవ చేసేందుకు ఎంతో మంది శఎన్ఆర్ఐ భ‌క్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని, అలాంటి వారి కోసం ప్ర‌త్యేకంగా T APP FOLIO మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. ఇందులో నాన్ రెసిడెంట్ ఇండియన్ అనే ప్ర‌త్యేక ఆప్ష‌న్ ద్వారా యాదాద్రి ఆల‌యంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌ల్కంపేట్ ఎల్ల‌మ్మ‌, పెద్ద‌మ్మ గుడి, సికింద్ర‌బాద్ గ‌ణేష్ టెంపుట్, క‌ర్మ‌న్ ఘాట్ ఆల‌యాలకు ఎన్ఐఆర్ దాత‌లు విరాళాల‌ను పంప వ‌చ్చ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ సేవ‌ల‌ను మ‌రిన్ని ఆల‌యాల‌కు విస్తరించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ కే. జ్యోతి, డిఫ్యూటీ క‌మిష‌న‌ర్ రామ‌కృష్ణ‌, యాదాద్రి ఆల‌య ఈవో గీతారెడ్డి, వేముల‌వాడ ఈవో కృష్ణ‌ప్ర‌సాద్, బాస‌ర ఆల‌య ఈవో వినోద్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్