సిఎం జగన్ కు అసలు మెగా బైట్, గిగా బైట్ అంటే తెలుసా అని టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు. ఒక మెగా బైట్ విద్యుత్ తో ఏపీ మొత్తానికీ విద్యుత్ సరఫరా చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇది అంకెల గారడీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. లోకేష్ యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. శింగనమల నియోజకవర్గంలో విడిది వద్ద బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
యువ గళం పాదయాత్ర ప్రజల్లో ఓ విప్లవం తీసుకు వస్తోందని, యాత్రకు అన్ని వర్గాల ప్రజలూ బ్రహ్మరథం పడుతున్నారని బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో వారికోసం పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చివరకు చెత్త మీద కూడా పన్ను వేస్తోందని, ఇంతకంటే దౌర్భాగ్యం, ఖర్మ రాష్ట్రానికి ఏముంటుందని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు. ఇంత మంది సలహాదారులు ఉన్నా వారికి ఏం చేయాలో తెలియదన్నారు.
తెలుగుదేశం చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని, ప్రజలు మరోసారి టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలంతా రాష్ట్రాన్ని వదిలేసి పారిపోవాల్సి ఉంటుందని బాలకృష్ణ హెచ్చరించారు.
Also Read : Nara Lokesh: బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం: లోకేష్