Compulsory fortification of rice from 2024
మీ ఉప్పులో ఉప్పుందా?
మీ పప్పులో పప్పుందా?
మీ బొందిలో ప్రాణముందా?
అని తాత్విక జ్ఞానసంబంధ మౌలికమయిన ప్రశ్నలు ప్రకటనల్లో రోజంతా వింటూ ఉంటాం. ఈ ప్రశ్నలు పైకి పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించినా…ప్రకటన తయారు చేసినవారి ఉద్దేశం నిజంగా మనల్ను పిచ్చోళ్లను చేయడమే.
“మీరు కడుపుకు అన్నమే తింటున్నారా?”
అని అడగ్గానే ఒక్కసారిగా మనం సిగ్గుతో తలదించుకుంటాం. సమంత చెప్పే అనంత ఉప్పుజ్ఞానం ఇన్నాళ్లుగా మనం పొందనందుకు నిలువెల్లా కుమిలిపోతాం. పశ్చాత్తాపంతో వెంటనే రోజుకు హీన పక్షం రెండు కేజీల ఉప్పు తినాలని ఉప్పు సంకల్పం చెప్పుకుంటాం. ఈలోపు ఇంకెవరో
“మీ పళ్ళపొడిలో బొగ్గు లేదా? అయితే మాడి మసై బొగ్గయిపోతారు”
అనగానే అప్పటికప్పుడు కట్టెలు కాల్చుకుని బొగ్గులు నములుతూ ఉంటాం.
జ్ఞానం స్టాటిక్ కాదు. డైనమిక్. ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ డైనమిక్ జ్ఞానం బియ్యం మీద పడింది.
మన దేశంలో వేల ఏళ్లుగా బియ్యం తింటున్నాం. తలంబ్రాలు, ఒడి బియ్యం, అక్షతలే బియ్యం పవిత్రతను, ప్రాధాన్యాన్ని, చరిత్రను చెప్పకనే చెబుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. విష్ణురూపం. అందుకే అన్నమయ్యకు ఆ పేరు పెట్టారు. బహుశా ప్రపంచంలో కోట్ల మంది అన్నమే తింటున్నా- అన్నమయ్య పేరు మాత్రం ఇంకెవరికీ ఉండి ఉండదు. కారణజన్ముడు. వెంకన్నకు ఆయన పదమే అన్నప్రసాదమయ్యింది కాబట్టి సార్థక నామధేయుడు.
సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడికయినా అన్నపూర్ణ భిక్ష పెట్టాల్సిందే. మహా యోగాల్లో అన్నయోగం గొప్పది. చేతిలో అన్న రేఖ ఉందో! లేదో! చూడమని ఇదివరకు హస్తసాముద్రిక నిపుణులకు చెయ్యి చూపించుకునేవారు. ఇప్పుడు రోటీ రేఖలు, పిజ్జా రేఖలు, బర్గర్ రేఖలు, లేటెస్ట్ గా స్విగ్గీ రేఖలు, జొమాటో రేఖలు వచ్చేసరికి అన్నరేఖ అందరి చేతుల్లో తనకు తానే బేషరతుగా అదృశ్యమై పోయింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్నం గురించి తెగ బాధపడుతోంది. దేశంలో 65 శాతం జనాభా ఆహారం అన్నమే. అయితే బియ్యంలో పోషక విలువలు లేకపోవడంతో జనం తరచుగా రోగాల బారిన పడుతున్నారట. ఉప్పును అయొడైజ్ చేసినట్లు- ఇకపై బియ్యానికి కూడా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 లను కృత్రిమంగా కలపాలని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇలా చేసిన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. బహుశా తెలుగులో దీనికి మాట ఉన్నట్లు లేదు. పోషకాలు కలిపిన బలవర్ధక బియ్యం అని అంటే తప్పు కాకపోవచ్చు.
Compulsory Fortification of Rice From 2024
బియ్యాన్ని బాగా పాలిష్ చేస్తే పోషకాలు పోతాయని అనాదిగా చెబుతున్నారు. గంజి వారిస్తే అసలయిన అన్నసారం పోతుందని శాస్త్రీయంగా నిరూపించారు. చేత్తో వడ్లను దంచిన బియ్యం మహా శ్రేష్ఠం అన్నారు. ఆర్గానిక్ బియ్యం ఇంకా మంచివి అన్నారు. ఇప్పుడు- ఇన్నాళ్లుగా మనం తింటున్న బియ్యంలో పోషక విలువలే లేవంటున్నారు.
బహుశా ఎరువులు, మందుల వాడకం ఎక్కువై వరిలో రసాయనాలు ఎక్కువ చేరినట్లున్నాయి. పేరుకు కడుపుకు అన్నం తింటున్నాం కానీ- అది అన్నం కాదు. అదేమిటో చెబితే బాగోదు.
పండిన వరిని దంచి, బియ్యానికి విటమిన్లు కలపడం కంటే- బయో ఫోర్టిఫైడ్ పద్ధతిలో సహజంగా వరి వెన్ను వేసేప్పుడే ఆ గుణాలను పొదివి పట్టుకునేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ- చాలా శ్రమ. చాలా ఓపిక ఉండాలి. పేడదిబ్బల సహజ ఎరువులు వేసి పండించిన వరి బియ్యం అన్నానికి- ఎరువుల మందులతో పండించిన బియ్యం అన్నానికి రుచి, ఆరోగ్యంలో తేడా ఏమిటో ఎవరికి వారు తెలుసుకోవాలి.ఇకపై పోషకాలు కలిపిన బియ్యాన్ని మాత్రమే మార్కెట్లలో అమ్మాలని, ప్రభుత్వాలు సరఫరా చేయాలని కేంద్రం చట్ట సవరణ కూడా చేయబోతోంది.
పోషకాలు కలిపిన అన్నమో! రామచంద్రా!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: