Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెద్దవారి హై స్పిరిట్! వారి పిల్లల ట్రూ స్పిరిట్!!

పెద్దవారి హై స్పిరిట్! వారి పిల్లల ట్రూ స్పిరిట్!!

గుజరాత్ సూరత్ లో సావ్ జీ పేరు మోసిన వజ్రాల వ్యాపారి. బహుశా ఆరు వేల కోట్ల వ్యాపారం. డెబ్బయ్ దేశాల్లో కార్యకలాపాలు. హీనపక్షం పది శాతం లాభం లెక్కగట్టినా ఏటా ఆరువందల కోట్లకు పైబడి సంపాదన. ఒక్కగానొక్క కొడుకు ద్రవ్య. అమెరికాలో వ్యాపార విద్య ఎం బి ఏ చదువుతూ సెలవుల్లో ఇండియాకు వచ్చాడు.

తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా పట్టాభిషేకం కావడమే తరువాయి. అలాంటి వేళ ద్రవ్య చేతిలో అక్షరాలా ఏడు వేల రూపాయల ద్రవ్యం పెట్టాడు తండ్రి. ఎందుకు అని అడిగాడు ద్రవ్య. ఈ సెలవులు నెల రోజులు నీకు భాష తెలియని దక్షిణాది కేరళలో ఏదయినా ఊరికెళ్లి నా పేరు, మన కంపెనీ పేరు చెప్పకుండా- నీకు నీవుగా గడిపి రా! ప్రపంచం తెలుస్తుంది అన్నాడు తండ్రి.

షరతులు షరా మామూలే. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడకూడదు. అప్పు చేయకూడదు. సెల్ ఫోన్ వాడకూడదు. ఒక చోట వారం కంటే ఎక్కువ రోజులు పని చేయకూడదు. ద్రవ్య ఒప్పుకున్నాడు. విమానమెక్కి కేరళ కొచ్చిన్ లో దిగాడు. తండ్రి షరతుల ప్రకారం పనిచేశాడు. ఒక బేకరీలో పనివాడిగా చేసి వారి మనసు గెలిచాడు. గడువు ముగిసింది. ఇంటికెళ్ళాడు. వార్తల్లోకి ఎక్కాడు.

పరీక్షలో నెగ్గి తండ్రి మనసు గెలిచాడు. చదువు పూర్తి చేశాడు. ఇప్పుడతను పది వేల కోట్ల వజ్రాల వ్యాపార సంస్థకు అధిపతి. ద్రవ్య తండ్రి హృదయం చాలా పెద్దది. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఏటా కోట్లు ఖర్చు పెట్టి వందల కార్లు, ఇళ్లు బహుమతులుగా ఇస్తూ ఉంటాడు. ఉదారుడు. భక్తి భావాలున్నవాడు. “సర్వేజనాస్సుఖినో భవంతు” ఆదర్శాన్ని నమ్మి నడుస్తున్నవాడు.

తన ధార్మిక భావజాలంతోనే కొడుకు ద్రవ్య కూడా “హరి కృష్ణా వజ్రాల ఎగుమతి కంపెనీ”ని నడపాలని సావ్ జీ కోరిక.

ఇప్పటికయితే కొడుకు ఆ మార్గంలోనే ఉన్నాడు. భవిష్యత్తులో కూడా తండ్రి నడిచిన చక్కటి దారిలోనే కొడుకు నడుస్తాడు.


ప్రస్తుతానికి వద్దాం

ఒక ప్రముఖ నాయకుడి కొడుకుకు మద్యం అలవాటు శ్రుతి మించింది. లివర్ చెడిపోయింది. అయినా తాగుడు మానలేదు. హైదరాబాద్ లో చికిత్స కోసం ఒక పేరుమోసిన ఆసుపత్రిలో చేరిస్తే- అక్కడి నుండి చెప్పాపెట్టకుండా మరో పేరు మోసిన హోటల్లోకి వచ్చేశాడు. అక్కడే రక్తం కక్కుకుని కన్ను మూశాడు. ఆ తండ్రికి అంతులేని విషాదాన్ని మిగిల్చాడు.

ఔటర్ రింగ్ రోడ్డు మీద మనో వేగంతో కార్లు నడిపి- తిరిగిరాని లోకానికి వెళ్లి తల్లిదండ్రులకు తీరని మనోవేదన మిగిల్చిన కొడుకుల వార్తలు లెక్కలేనన్ని. నడిరాత్రి 210 కిలో మీటర్ల ఊహకందని వేగంతో కారు నడిపి మెట్రో పిల్లర్ కు బతుకును బలి చేసిన కొడుకు వార్త గుర్తుండే ఉంటుంది. రాత్రిళ్లు బైక్ రేసింగుల్లో బతుకులను చీకట్లలో కలిపిన కొడుకుల వార్తలు జోనల్ పేజీల్లో కూడా చోటు దక్కనంత కామన్ అయ్యాయి.

అధికారం, సంపద, వైభోగంలో కొడుకులు అలా మిసమిసలాడుతూ, తూలుతూ, ఊగుతూ ఆకాశమే హద్దుగా రాత్రి పగలు జల్సాలు చేస్తూ గడపాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో? ఆధునిక సంపన్నుల జీవన విధానమిలాగే ఉండాలని తల్లిదండ్రులే నానా అలవాట్లను ప్రోత్సహిస్తున్నారో? మూతి మీద మీసం కూడా మొలవకముందే కన్ను మిన్ను కానక కొడుకులు దారి తప్పితే తల్లిదండ్రులు గడ్డి పెట్టలేకపోతున్నారో? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారో?

సినిమాలు, ఓ టీ టీ ల సకల వినోద మాధ్యమాల్లో నానా దురలవాట్లను గొప్ప కార్యాలుగా భిన్న కోణాల్లో చూపుతూ – సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాల అమ్మకాలకు సేల్స్ ప్రమోషన్ కలిగిస్తున్నారు. పేరుమోసిన ఏయే సెలెబ్రిటీకి ఎన్నెన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, ఇతరేతర మత్తుల వ్యాపారాలు ఉన్నాయో బహిరంగరహస్యం.

టచ్ వుడ్!
థాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే!
బీట్స్ పర్ మినిట్!
బీ డబ్స్!
హై లైఫ్!

పెద్దవారిది హై స్పిరిట్!
వారి పిల్లలది ట్రూ స్పిరిట్!
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్