Thursday, March 28, 2024
HomeTrending Newsయోగి నేతృత్వంలోనే బరిలోకి బిజెపి

యోగి నేతృత్వంలోనే బరిలోకి బిజెపి

ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ  ఎదుర్కోనుంది. సిఎం యోగి కి మద్దతుగా జాతీయ నాయకత్వం కూడా నిలబడింది. మీడియా,సోషల్ మీడియా లో యోగీకి వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు తెరదించింది. సిఎం పై పార్టీలో అసంతృప్తుల  గళాన్ని అనుమతిస్తే 2022 మార్చి లో జరిగే ఎన్నికల్లో నష్టం జరుగుతుందని ఢిల్లీ పెద్దల భావన. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి సంతోష్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి.

ఇటీవల లక్నో లో జరిగిన పార్టీ కార్యక్రమంలో యోగి వ్యతిరేక వర్గం  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి సంతోష్ కు వివిధ అంశాలపై ఫిర్యాదు చేసింది. కరోన కట్టడిలో యోగి విఫలం అయ్యారని దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. ప్రభుత్వానికి – పార్టీకి మధ్య సమన్వయం లేదని  ముఖ్యమంత్రి పార్టీ శ్రేణుల్ని ఖాతరు చేయటం లేదని ఆరోపణలు చేశారు.

అన్నీ విన్న కమలం నేత  సంతోష్  బిజెపి సిద్దాంతాలు తూచా తప్పకుండా  సిఎం యోగి  పాటిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ఇరవై కోట్ల పైచిలుకు జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో  ప్రతి నగరాన్ని, పట్టణాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షించ లేరని ట్విట్టర్ లో పేర్కొన్నారు.  కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారన్నారు. 12 ఏళ్ళ వయసు లోపలి చిన్నారుల తల్లిదండ్రులకు వ్యాక్సిన్ ప్రత్యెక డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించటం సిఎం యోగి ముందు చూపునకు నిదర్శనమని ఆకాశానికి ఎత్తారు. థర్డ్ వేవ్ కట్టడికి ఇది ప్రయోజనకారి అవుతుందని యోగి ఆదిత్యనాథ్ ను పార్టీ నేత సంతోష్ ప్రశంసించారు.

అయితే ఉత్తర ప్రదేశ్ లో  వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. గంగా నదిలో రోజు వందలాది శవాలు కలపటం, ప్రయగ్ రాజ్ నుంచి ఘాజీపూర్ వరకు గంగా నది తీరంలో శవాల దిబ్బలు కమలం నేతలకు కలవరం కలిగిస్తున్నాయి. చివరకు గంగా నది తీరం వెంబడి పోలీసు పహారా పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ తన నియోజకవర్గం బరేలి లోనే ఆక్సిజెన్ కొరత ఉందని ప్రజలను కాపాడాలని ముఖ్యమంత్రికి  ఫిర్యాదు చేయటం కలకలం సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు పుంజుకోవటం రాష్ట్ర నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వేల్లదీస్తుంటే కమలం నేతలు రాబోయే ఎన్నికల్లో వ్యూహ, ప్రతి వ్యూహాలపై సమాలోచనలు చేస్తున్నారని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దాద్రి గో హత్య పేరుతో మైనారిటీలపై దారుణాల నుంచి ఇటివలి హత్రాస్ అత్యాచార ఘటనలో బాధితుల పైనే అఘాయిత్యాలు ప్రజలు మరచి పోలేదని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గుర్తు చేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో వయసు రిత్యా బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి ఎంతవరకు క్రియాశీలకంగా పనిచేస్తారో వేచిచూడాలి. కారణాలు ఏవైనా  యు.పి. లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించటం లేదు.  ఎన్నికల బరిలో ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ – యోగి అడిత్యనాత్ లే తలపడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

2017 లో జరిగిన ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ లో బిజేపి ఉహించని మెజారిటీ సాధించింది. 403 శాసనసభ స్థానాల్లో 309 సీట్లు కమలం దక్కించుకుంది. ఎస్.పి. 49, బిఎస్పి-18, కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. మిగతా సీట్లు ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.  ఉత్తర ప్రదేశ్ లో పట్టు బిగిస్తే జాతీయ ఎన్నికల్లో తిరుగు ఉండదు అనే వాదన ఉంది. 2022 మార్చి లో జరిగే ఎన్నికల్లో పార్టీల భవితవ్యం తేలనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్